Rishabh Pant: ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్

దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్‌కు ముందు గాయంతో కెఎల్ రాహుల్ దూరమవడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 03:38 PM IST

దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్‌కు ముందు గాయంతో కెఎల్ రాహుల్ దూరమవడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సమర్థవంతంగా కెప్టెన్సీ చేస్తున్న పంత్‌ తొలిసారి జాతీయ జట్టు పగ్గాలు అందుకున్నాడు. భవిష్యత్తులో పంత్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉండడంతో ఈ సిరీస్‌ మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే తొలి టీ ట్వంటీలో పంత్ కెప్టెన్సీ పెద్దగా ఆకట్టుకోలేదు.

ఒత్తిడికి గురైనట్టు కనిపించింది. కాగా మ్యాచ్ ఫలితాన్ని పక్కనపెడితే ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో క్రమంగా మెరుగవుతున్న పంత్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికవడంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. భారత జట్టుకు టీ20 ఫార్మాట్ కెప్టెన్ అయిన రెండో అతిపిన్న సారథిగా రికార్డు సృష్టించాడు. గతంలో సురేశ్ రైనా 23 ఏళ్ల 197 రోజుల వయస్సులో టీ20 జట్టుకు కెప్టెన్సీ చేపట్టి. అత్యల్ప వయస్సులో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రైనా తర్వాత ఆ స్థానంలో ధోనీ కొనసాగుతుండగా.. ఇప్పుడు పంత్ అతన్ని అధిగమించాడు. పంత్ 24 ఏళ్ల 248 రోజుల వయస్సులో టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. మహేంద్ర సింగ్ ధోనీ 26 ఏళ్ల 66 రోజులతో మూడో స్థానంలో నిలిచాడు.
ఓవరాల్‌గా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున నేతృత్వం వహించిన నాలుగో వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సయ్యద్ కిర్మాణి, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ ఈ జాబితాలో ఉండగా… ఇప్పుడు పంత్ కూడా చేరిపోయాడు. ఇదిలా ఉంటే తొలి టీ ట్వంటీలో భారత్ పరాజయం పాలైంది. భారీస్కోర్ చేసినప్పటకీ బౌలర్లు విఫలమడంతో సౌతాఫ్రికా 212 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. మిల్లర్, డస్సెన్ మెరుపు బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాకు విజయాన్నందించారు. దీంతో టీ ట్వంటీ ఫార్మేట్‌లో వరుసగా 13వ విజయం సాధించి రికార్డు సృష్టించాలనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉండటంతో జట్టు కూర్పులను పరీక్షించుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటున్నాయి.