T20 captain: టీ ట్వంటీలకు కొత్త కెప్టెన్ అతనే..!

భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే ప్రక్షాళన షురూ చేసింది.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 02:20 PM IST

భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే ప్రక్షాళన షురూ చేసింది. సెలక్షన్ కమిటీపై వేటు వేసి కొత్త సెలక్టర్లను నియమించనుంది. అంతేకాదు టీమిండియా కెప్టెన్సీలోనూ మార్పులు చేయనుంది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం టీ ట్వంటీలకు కొత్త కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ఎంపిక ఖాయమైంది. శ్రీలంకతో సిరీస్ కు ముందు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. రోహిత్ ఇక వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో సారథిగా కొనసాగనున్నాడు. పాండ్యా షార్ట్ ఫార్మాట్ లో జట్టును లీడ్ చేస్తాడని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కొత్త సెలక్టర్లు రాగానే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

నిజానికి గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ స్థానంలో నియమితుడైన రోహిత్ పై భారీగానే అంచనాలున్నాయి. ఐపీఎల్ లో ముంబైని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన హిట్ మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్ లలో భారత్ జట్టును బాగానే నడిపించాడు. అయితే ఆసియా కప్, టీ ట్వంటీ వరల్డ్ కప్ లలో మాత్రం జట్టును గెలుపుబాట పట్టించలేకపోయాడు. దీంతో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొత్త సారథిగా పాండ్యాను ఎంపిక చేయాలన్న వాదన మొదలైంది. గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన పాండ్యా ఆల్ రౌండర్ గానూ నిలకడగా రాణిస్తుండడంతో అతనే మంచి ఛాయిస్ గా భావిస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని వయసు రీత్యా రోహిత్ కంటే పాండ్యానే బెటర్ అని బీసీసీఐ డిసైడైంది.

అయితే రోహిత్‌ పూర్తిస్థాయి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే, ఈ ప్రయోగాలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ మినహాయించి రోహిత్‌ పెర్ఫార్మెన్స్‌ బాగానే ఉంది కదా అంటూ హిట్‌మ్యాన్‌ను వెనకేసుకొస్తున్నారు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ను మరికొంత కాలం కొనసాగించాలని కోరుతున్నారు.
మరికొందరు మాజీలు, విశ్లేషకులు మాత్రం వచ్చే టీ20 ప్రపంచకప్‌ కోసం హార్ధిక్‌ను ఇప్పటినుంచే టీ20 కెప్టెన్‌గా ప్రమోట్‌ చేయడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు.