టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుకలో ఊహించని షాకింగ్ ఘటనలు ఎదురవుతున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారం రోజులుగా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతుండగా, ఆదివారం జరగాల్సిన వివాహం అర్ధంతరంగా వాయిదా పడింది. దీ పెళ్లికి కొద్దిసేపటి ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్లు స్మృతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ అకస్మాత్తు పరిణామంతో పెద్ద ఎత్తున చేసిన వివాహ ఏర్పాట్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి.
Sivaji : చిత్రసీమలో ఆ ముగ్గురే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు – శివాజీ సంచలన వ్యాఖ్యలు
దురదృష్టవశాత్తూ, అదే సమయంలో మరో ఆందోళనకరమైన వార్త కూడా స్మృతి కుటుంబానికి చేరింది. పెళ్లి కుమారుడు పలాష్ ముచ్చల్ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా క్షీణించడంతో, అతన్ని కూడా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. పలాష్‌కు వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు తీవ్రమైన జీర్ణ సమస్యలు (డైజషన్ ప్రాబ్లమ్స్) వచ్చాయి. అయితే పలాష్ పరిస్థితి అంత ప్రమాదకరంగా ఏమీ లేదని నిర్ధారణ కావడంతో, తక్షణ వైద్య చికిత్స అనంతరం అతన్ని డిశ్చార్జ్ చేశారు. అనంతరం అతను వెడ్డింగ్ హోటల్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ రెండు సంఘటనలు స్మృతి కుటుంబంలో ఒక రోజులోనే తీవ్ర ఆందోళన కలిగించాయి.
స్మృతి తండ్రి ఆరోగ్యంపై కుటుంబ వైద్యుడు డాక్టర్ నమన్ షా కీలక వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్ మంధానాకు ఎడమ వైపున వచ్చిన ఛాతీ నొప్పిని వైద్యపరంగా ‘ఆంజైనా’ అని పిలుస్తామని ఆయన వివరించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత జరిపిన ECG మరియు ఇతర పరీక్షల్లో కార్డియాక్ ఎంజైమ్‌లు పెరిగినట్లు గుర్తించామని, అందువల్ల ఆయన్ను నిరంతర పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉందని డాక్టర్ షా తెలిపారు. పరిస్థితి మరింత క్లిష్టంగా మారితే యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుందని కూడా వైద్యులు పేర్కొన్నారు. శ్రీనివాస్ మంధానా పూర్తిగా కోలుకున్న తర్వాతే కొత్త వివాహ తేదీని ఖరారు చేస్తామని, ఈ పరిస్థితులు అన్నీ చక్కబడే వరకు పెళ్లి గురించి ఆలోచించబోమని స్మృతి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
