T20 Pakistan: భారత్ గెలవాలని కోరుకుంటున్న పాక్..!

మీరు చదివింది నిజమే... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ భారత్ జట్టు విజయాన్ని కోరుకుంటోంది.

  • Written By:
  • Updated On - October 29, 2022 / 10:50 AM IST

మీరు చదివింది నిజమే… చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ భారత్ జట్టు విజయాన్ని కోరుకుంటోంది. ఆదివారం సౌతాఫ్రికాపై రోహిత్ సేన గెలవాలని ప్రార్థిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్థాన్ ప్రపంచకప్ భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతోంది. భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ కు రెండో మ్యాచ్ లో జింబాబ్వే షాకిచ్చింది. 130 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 1 పరుగు తేడాతో పరాజయం పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ సెమీస్ ఆశలు భారత్ చేతిలో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఓడినా టెక్నికల్‌గా మాత్రం పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.

గ్రూపు-2 నుంచి పాకిస్తాన్‌ సెమీస్‌లో అడుగు పెట్టాలంటే తమ తదుపరి మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి. పాకిస్తాన్‌ వరుసగా నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో పాక్‌ విజయం సాధిస్తే వారి ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ సెమీస్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. అప్పడు రన్‌రేట్‌ కీలకం కానుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ భవితవ్యం ఆక్టోబర్‌ 30న భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఒక వేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలు ముగిసినట్టే.

భారత్‌తో మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా.. పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడనుంది. భారత్‌పై విజయం సాధించి.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సఫారీ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెడుతోంది. ఒక వేళ దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా భారత్‌, పాకిస్తాన్‌ చేతిలో ఓడితే అప్పుడు బాబర్‌ సేన ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.