Site icon HashtagU Telugu

Pakistan Vs SA: సెమీస్ ఆశలు నిలుపుకున్న పాక్‌

Pakistan Cricket Board

Pakistan Cricket Board

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన సెమీపైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ఇరు జట్ల చేతులూ మారుతూ ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఒక దశలో పాక్ వరుసగా కీలక వికెట్లు కోల్పోయింది. కనీసం 150 స్కోరైనా చేస్తుందనుకుంటున్న వేళ షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ మహమ్మద్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జే 4 వికెట్లతో రాణించాడు.

186 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచి నిదానంగా ఆడింది. చికాక్, రొస్కూ త్వరగానే ఔటవగా..లో కెప్టెన్ తెంబా బవుమా, మార్క్‌క్రమ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే షాదాబ్ ఖాన్ ఒకే ఓవర్లో వీరిద్దరిని ఔట్ చేసి పాకిస్థాన్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ దశలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించారు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులే చేయగలిగింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ 3 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో పాక్ జట్టు సెమీస్ రేసులో నిలిచింది. అయితే మిగిలిన జట్ల ఫలితాలపై వారి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. గ్రూప్ 2 నుంచి ఐదు జట్లు సెమీస్ రేసులో ఉన్నాయి.