Site icon HashtagU Telugu

Pakistan In Asia Cup Finals: ఆసియా కప్ నుంచి భారత్ ఔట్ పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్

pakistan team

pakistan team

అద్బుతం జరుగుతుందని ఆశించిన భారత క్రికెట్ ఫాన్స్ కు నిరాశే మిగిలింది. ఒకే దశలో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చేలా కనిపించిన ఆఫ్గనిస్తాన్ చివరి వరకూ పోరాడి ఓడింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ మరోసారి తన అలవాటు రిపీట్ చేసింది. చివరికి ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆఫ్గన్‌ బ్యాటర్లు పరుగులు తీయడంలో ఇబ్బంది పడ్డారు. అఫ్గనిస్తాన్‌ బ్యాటర్లలో ఇబ్రహీ జర్దన్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హజరతుల్లా జజేయ్‌ 21, రహమనుల్లా గుర్బాజ్‌ 17 పరుగులు చేశారు.

130 రన్స్ టార్గెట్ చిన్నదే కావడంతో పాక్ సునాయాసంగా గెలుస్తుందని చాలా మంది భావించారు. అయితే ఈ స్కోరు కాపాడుకునేందుకు ఆఫ్గనిస్తాన్ పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పాక్ పై ఒత్తిడి పెంచారు. పరుగులు చేసేందుకు పాక్ బ్యాటర్లు శ్రమించారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కూడా కోల్పోయింది. ఇఫ్తకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ పార్టనర్ షిప్ తో కోలుకుంది. అయితే చివరి అయిదు ఓవర్లలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాక్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆఫ్గన్ గెలిచేలా కనిపించింది. ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉండగా…12 రన్స్ చేయాల్సి ఉంది. ఈ దశలో నసీం షా వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో పాక్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ ఫైనల్ కి చేరుకోగా…ఆఫ్గనిస్తాన్ , భారత్ ఇంటిదారి పట్టాయి. రెండు జట్ల మధ్య రేపు నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్ , శ్రీలంక తలపడనున్నాయి.