Site icon HashtagU Telugu

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్

Champions Trophy

Champions Trophy

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ ఫిబ్రవరి-మార్చిలో జరగనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. బోర్డుకు అతిపెద్ద ముప్పు భారత్ నుంచే. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుందని బీసీసీఐ పాక్ క్రికెట్ బోర్డుకు ఇంకా హామీ ఇవ్వలేదు. ఇదే పాక్ ఆందోళనకు ప్రధాన కారణం. ఒకవేళ భారత్ నిరాకరిస్తే పీసీబీ భారీ నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి ఉంటుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇది రాజకీయ సమావేశమని, క్రికెట్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అలాగే పీఎం మోడీ వెళ్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు కానీ.. మోడీని ఆహ్వానించి పాకిస్థాన్ మాత్రం కచ్చితంగా స్నేహ హస్తం చాచింది. మోడీ SCO సమావేశానికి చేరుకుని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉందని పాకిస్థాన్ ఆలోచిస్తోంది.

ఇవన్నీ ఊహాగానాలే అయినా పాకిస్థాన్ మాత్రం కచ్చితంగా ఎక్కడో ఒక చోట తనదైన ఎత్తుగడ వేసింది. 2023 ఆసియా కప్ పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. భారత జట్టు కూడా పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంది కానీ భద్రతా సమస్యల కారణంగా టీమ్‌ఇండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. బీసీసీఐ నిరాకరించడంతో, ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లకపోతే బోర్డుకు పెద్ద నష్టం తప్పదు. దీనిని నివారించేందుకు పీసీబీ, ప్రభుత్వం భారత్‌ను ఆహ్వానించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

Also Read: AP Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం