వయసు 93.. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో తగ్గేదే లే..

93 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు...ప్రశాంతమైన జీవితం గడుపుతారు.. మనవలు,మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 12:34 PM IST

93 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు…ప్రశాంతమైన జీవితం గడుపుతారు.. మనవలు,మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు. కానీ కేరళకు చెందిన శంకరనారాయణ మీనన్ మాత్రం దీనికి భిన్నం. ఇంత వయసులోనూ తన విద్యను విడిచిపెట్టకుండా శిక్షణ ఇస్తున్నారు. శంకరనారాయణ మీనన్ అంటే మిగిలిన రాష్ట్రాల వారికి తెలియకపోవచ్చు కాని కేరళలో ఆయన గురించి తెలియని వారు లేరు. కేరళ సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ కలరీపట్టు విద్యలో ఆయన ఒక దిగ్గజం. ఎన్నో ఏళ్ళుగా ఈ విద్యలో ఆరితేరిన ఆయన ఎంతోమందికి దానిని నేర్పిస్తూ గురువుగా ఉంటున్నారు. తాజాగా ఈయన చేస్తున్న సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కారం రావడంపై సంతోషం వ్యక్తం చేసిన శంకరనారాయణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను బతికి ఉన్నంత కాలం ఈ విద్యను అందరికీ నేర్పిస్తూనే ఉంటానని, అది తన బాధ్యత అని వ్యాఖ్యానించారు.

పద్మ పురస్కారం ప్రకటించిన మరుసటి రోజు కూడా ఈయన దినచర్యలో ఏ మార్పూ లేదు. ప్రతీరోజూ మాదిరిగానే ఉదయం 5 గంటలకు లేచి , తమ ఆరాధ్య దేవాలయంలో పూజలు ఆచరించి ఎప్పటిలానే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ప్లేస్ కు వెళ్ళిపోయారు. దాదాపు 3 గంటల పాటు వారికి ట్రైనింగ్ ఇవ్వడం ఆయన దినచర్య. 93ఏళ్ళ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కలరీపట్టు విద్యను యువకులకు నేర్పిస్తున్నారు. ఆయన కుమారుడు కూడా ఇదే విద్య నేర్చుకుని తండ్రి బాటలోనే నడుస్తున్నారు. కుస్తీలో కనిపించే విధంగా తాము కండలు పెంచలేమని, అయితే కండరాల బలాన్ని పెంచే విద్య ఇదని చెప్పుకొచ్చారు. వీరి కుటుంబం కలరీపట్టు విద్యను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు కూడా కృషి చేస్తోంది. యూకే, యుఎస్ఎ, ఫ్రాన్స్ , బెల్జియం, శ్రీలంకలో వీటి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా శంకరనారాయణ మీనన్ దాదాపు 5 వేలమందికి పైగా ఈ విద్యను నేర్పించారు. 93 ఏళ్ళ వయసులోనూ చురుగ్గానే ఉంటూ యువకులకు శిక్షణ ఇస్తున్న శంకరనారాయణ మీనన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.