Yuvraj on Dhoni: అతని వల్లే నేను కెప్టెన్ కాలేకపోయా – యూవీ

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ తన కెరీర్ లో ఎన్నో ఘనతలు , రికార్డులు సాధించినప్పటికీ భారత జట్టుకు మాత్రం పూర్తిస్థాయి సారథిగా వ్యవహరించలేకపోయాడు.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 02:42 PM IST

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ తన కెరీర్ లో ఎన్నో ఘనతలు , రికార్డులు సాధించినప్పటికీ భారత జట్టుకు మాత్రం పూర్తిస్థాయి సారథిగా వ్యవహరించలేకపోయాడు. టీమిండియాకు కొంతకాలం మాత్రం వైస్‌కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. అయితే, తాను 2007లోనే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవాల్సి ఉండగా.. కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేకపోయిందని తాజాగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ టీమిండియా సారథిగా ఎంపికయ్యే సమయంలోనే గ్రెగ్‌ చాపెల్‌ తో గొడవ తనను సారథ్య బాధ్యతలు అందుకోకుండా చేసిందన్నాడు.

గ్రెగ్ చాపెల్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో అతనితో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీలకు అభిప్రాయం బేధాలొచ్చాయని, 2007 టీ20 ప్రపంచకప్‌ జరగడానికి నెల రోజుల ముందు ఛాపెల్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలను చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నాడు. ఇక 2007లో ఇంగ్లండ్‌ పర్యటనకు సెహ్వాగ్‌ అందుబాటులో లేడనీ, దీంతో ద్రవిడ్‌ కెప్టెన్‌గా.. తాను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత జట్టులో తీవ్ర స్థాయిలో విభేదాలు చెలరేగడంతో.. తాను కోచ్ చాపెల్ కు కాకుండా జట్టుకు సపోర్ట్‌ చేయడం, ఇది బీసీసీఐలోని కొందరికి నచ్చలేదనీ చెప్పుకొచ్చాడు.

నిజానికి 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో తాను కెప్టెన్ అవ్వాల్సి ఉందనీ, అయితే బీసీసీఐ పెద్దల కారణంగా జట్టు పగ్గాలు ధోని చేతిలోకి వెళ్లిపోయాయనీ చెప్పాడు. ఇందులో ధోని తప్పేం లేదన్న యువీ బీసీసీఐ నిర్ణయాన్ని అతను గౌరవించాడనీ చెప్పుకొచ్చాడు. తర్వాత అనతికాలంలోనే అత్యుత్తమ సారథిగా మహి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపాడు. ఏదేమైనా టీమ్ఇండియాకు సారథ్యం వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తానన్న యూవీ తానెప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తాననీ తెలిపాడు. అందుకే క్లిస్ పరిస్థితుల్లో జట్టుకు మద్దతిచ్చానని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక తన 19 ఏ‍ళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ ట్వంటీలు ఆడాడు. టెస్టుల్లో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు.అలాగే వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేయడంతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ ట్వంటీ ల్లో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్ లో 29 వికెట్లు పడగొట్టాడు.