Site icon HashtagU Telugu

(Suryakumar Yadav: మళ్ళీ చెబుతున్నా.. ఇది నా అడ్డా

Suryakumar Yadav

Suryakumar Yadav

బంతి ఎటు వేసినా మణికట్టుతో కనికట్టు చేసి బౌండరీ దాటిస్తాడు.. ఎక్కడ గ్యాప్ కనిపిస్తే అక్కడ బాల్ బౌండరీ అవతల పడాల్సిందే.. అప్పర్‌ కట్‌, స్కూప్ షాట్, స్వీప్ , రివర్స్ స్వీప్‌… ఇలా సూర్య అమ్ములపొదిలో షాట్లు ఎన్నెన్నో. ముఖ్యంగా వికెట్ కీపర్‌ వెనక్కి అతను కొట్టిన షాట్లు వర్ణించేందుకు మాటలు చాలవు.. చూసితీరాల్సిందే.. బంతిని ఇలా కూడా సిక్సర్‌ కొట్టొచ్చా అనిపించేలా సాగింది లంకపై సూర్యకుమార్ (Suryakumar Yadav) బ్యాటింగ్‌.. క్రికెట్‌ బుక్‌లో షాట్ల గురించి తెలుసుకోవాలంటే సూర్య బ్యాటింగ్ చూస్తే చాలంటున్నారు ఫ్యాన్స్.

క్రికెట్‌లో అందరూ అన్ని షాట్లూ ఆడలేరు.. కొందరు కొన్ని షాట్లే ఆడగలరు.. అన్ని షాట్లూ అది కూడా గ్రౌండ్ నలువైపులా కొట్టేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.. ఆ జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు సూర్యకుమార్ యాదవ్‌.. వరల్డ్‌ క్రికెట్‌లో ఏబీ డివీలియర్స్ తర్వాత మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య ప్రస్తుతం టీ ట్వంటీ ఫార్మాట్‌ను తన అడ్డాగా మార్చేసుకున్నాడు. అరంగేట్రం చేసిన ఏడాదిలోనే నెంబర్‌ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. గత ఏడాది కాలంగా పొట్టి క్రికెట్‌లో సూర్యకుమార్‌ హవా కొనసాగుతోంది. సాధారణంగా వన్డేల్లో సెంచరీ చేస్తేనే శెబాష్ అంటారు.. అలాంటిది సూర్యకుమార్ ఏడు నెలల వ్యవధిలోనే టీ ట్వంటీల్లో మూడు శతకాలు సాధించాడు. వీటిలో రెండు విదేశాల్లో చేస్తే.. తాజాగా స్వదేశంలోనూ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read: Cooking Oils : ఈ వంట నూనెలు వాడితే కొలెస్ట్రాల్ పెరగదు!

శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో సూర్యకుమార్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బౌలర్ బంతి ఎలా వేసినా బౌండరీ దాటించాడు. తనకు మాత్రమే సాధ్యమైన కొన్ని షాట్లలో అతని స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే లంకపై సూర్య బ్యాటింగ్ ఒక ఇన్నింగ్స్ హైలైట్స్‌లా సాగింది. క్రికెట్‌ బుక్‌లో ఉన్న అని షాట్లూ వీక్షించాలనుకుంటే శ్రీలంకపై సూర్యకుమార్ బ్యాటింగ్ చూస్తే చాలు. తనను టీమిండియా మిస్టర్ 360గా ఎందుకు పిలుస్తారో ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి నిరూపించాడు స్కై.

220 స్ట్రైక్‌రేట్‌తో అతని బ్యాటింగ్‌ను చక్కని విందు భోజనంగా ఫ్యాన్స్ ఆస్వాదిస్తే..  ఏం చేయాలో తెలియక లంక ఆటగాళ్ళు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. టీ ట్వంటీల్లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే టాప్ ప్లేస్‌కు దూసుకెళ్ళిన సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులకు బద్దలుకొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో 3 శతకాలు సాధించిన ఓపెనర్ కాని బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్‌ శర్మ తర్వాత టీ ట్వంటీల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. అలాగే రోహిత్ తర్వాత అత్యంత వేగంగా టీ ట్వంటీ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గానూ రికార్డులెకెక్కాడు. మొత్తం మీద రాజ్‌కోట్‌లో సూర్యప్రతాపంతో టీమిండియా సునాయాసంగా సిరీస్ కైవసం చేసుకుంది.