Site icon HashtagU Telugu

Hardik Pandya: ఒక్క ఓటమితో వచ్చిన నష్టం ఏమీలేదు, కుర్రాళ్లు పాఠాలు నేర్చుకున్నారు: హార్థిక్ పాండ్యా

Pandya-Natasa

Pandya-Natasa

వెస్టిండీస్ పై సిరీస్ ఓటమికి బాధ్యత తనదేనని టాప్ ర్యాంకర్ భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా ప్రకటించాడు. ఆఖరి టీ-20లో భారత్ ను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా కరీబియన్ జట్టు 3-2తో సిరీస్ విజేతగా నిలిచింది. 7వ ర్యాంక్ జట్టు వెస్టిండీస్ తో జరిగిన 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-3తో ఓటమి పొందడంతో షాక్ లో పడిపోయింది. 5వ మ్యాచ్ లో భారత్ కీలక టాస్ నెగ్గినా బ్యాటింగ్ వైఫల్యంతో 8 వికెట్ల పరాజయం పాలయ్యింది. సిరీస్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లో రెండుజట్లు..రెండేసి వరుస విజయాలు, పరాజయాలతో 2-2తో సమఉజ్జీలుగా నిలిచాయి. సిరీస్ విజేతగా నిలవాలంటే ఆఖరి మ్యాచ్ లో నెగ్గితీరాల్సిన స్థితిలో భారత్ బోల్తా కొట్టింది. నాలుగో టీ-20లో చేజింగ్ కు దిగి 179 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించిన భారత్..ఆఖరిమ్యాచ్ లో మాత్రం చేజింగ్ సాహసానికి దిగలేకపోయింది.

ఇన్నింగ్స్ మొదటి 10 ఓవర్లలోనే 4 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ 87 పరుగుల స్కోరు మాత్రమే సాధించిన సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా నిలదొక్కుకొన్నా ధాటిగా తన దైన శైలిలో ఆడలేకపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే పోరాడి ఆడి 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియా షెఫర్డ్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 2, హోల్డర్ 2, చేజ్ 1 వికెట్ పడగొట్టారు.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఎదురైన సిరీస్ ఓటమికి తానే బాధ్యత తీసుకొంటానని భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా పరాజయం అనంతరం ప్రకటించాడు. చివరి 10 ఓవర్లలో తాను అనుకొన్నట్లుగా పరుగులు రాబట్టలేకపోయానని, ఓటమికి ప్రధానకారణం అదేనని ఒప్పుకొన్నాడు. ఒక్క సిరీస్ ఓటమితో వచ్చిన నష్టం ఏమీలేదని, తమ కుర్రాళ్లు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకొన్నారని చెప్పాడు. యువబ్యాటర్లు యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, పేసర్ ముకేశ్ కుమార్ లపై ప్రశంసల వర్షం కురిపించాడు.

Also Read: Tomato Prices: భారీగా తగ్గిన టమాటా ధరలు, కిలోకు ఎంతంటే

Exit mobile version