11 Years of Virat Kohli: కోహ్లీ టెస్ట్ కెరీర్ @ 11 యేళ్లు

సరిగ్గా పదకొండేళ్ల కిందట.. టీమిండియా అప్పటికే వరల్డ్‌ కప్‌ గెలిచి రెండున్నర నెలలు మాత్రమే అయింది.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 05:26 PM IST

సరిగ్గా పదకొండేళ్ల కిందట.. టీమిండియా అప్పటికే వరల్డ్‌ కప్‌ గెలిచి రెండున్నర నెలలు మాత్రమే అయింది. ఆ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2011, జూన్‌ 20న వెస్టిండీస్‌తో మొదలైన ఆ మ్యాచ్‌ కోహ్లికి తొలి టెస్ట్… ఆ మ్యాచ్ ఆడి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 17 సెకన్ల స్పెషల్‌ వీడియోను విరాట్‌ అభిమానులతో పంచుకున్నాడు. ఆ 17 సెకన్లలోనే తన 11 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ జర్నీని సింపుల్‌గా, ఎంతో అందంగా చూపించాడు. కంప్యూటర్‌లో టెస్ట్‌ అనే ఫోల్డర్‌ ఓపెనర్‌ చేయగానే.. తన టెస్ట్ కెరీర్‌లో సాధించిన మైలురాళ్లకు సంబంధించిన ఫొటోలన్నీ రావడం ఈ వీడియోలో చూడొచ్చు. అందులో అతడు సాధించిన సెంచరీలు, సిరీస్‌ విజయాలు, సంబరాలు అన్నీ ఉన్నాయి.
ఈ 11 ఏళ్లలో విరాట్‌ 101 టెస్టులు ఆడి 50 సగటుతో 8043 రన్స్‌ చేశాడు. అందులో 27 సెంచరీలు, 28 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన అత్యధిక స్కోరు 254 నాటౌట్‌. ఈ బెస్ట్‌ మూమెంట్స్‌ను కోహ్లి తన వీడియోలో చూపించే ప్రయత్నం చేశాడు. క్రీజులో దిగాక అతని బ్యాటింగ్ జోరుకు బ్రేక్ వేయలేక బౌలర్లు తల పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే సచిన్ తర్వాత భారత్ క్రికెట్ రన్ మెషీన్ గా కోహ్లీ నే పిలుస్తారు. అయితే
గత రెండున్నరేళ్లుగా విరాట్ అత్యంత పేలవమైన ఫామ్ తో సతమతం అవుతున్నాడు. ఏ ఫార్మాట్ లోనూ ఒక్క సెంచరీ చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ యేడాది ఆరంభంలో
టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ , ఐపీఎల్‌ లో కూడా రాణిచలేదు. ప్రస్తుతం తన కెరీర్‌లోనే దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్న కోహ్లీ రాబోయే ఇంగ్లాండ్ టూర్ చాలా కీలకం కానుంది. ఐపీఎల్‌ సీజన్‌ను త్వరగా మరచిపోయి.. మళ్లీ మునుపటి కోహ్లిని చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. గతేడాది అతని కెప్టెన్సీలోనే జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా 2-1 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ఆ సీరీస్ లో మిగిలిన ఏకైక టెస్టులోనూ గెలిచి ఇంగ్లీష్ గడ్డపై చారిత్రక విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తోంది.