World Cup 2023: వన్డే ప్రపంచకప్ (World Cup 2023) లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక నాకౌట్ ఫైట్స్ మిగిలాయి. ఆదివారం భారత్, నెదర్లాండ్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుండగా.. ఇవాళ జరిగిన మ్యాచ్ ల తర్వాత భారత్ సెమీస్ ప్రత్యర్థి అధికారికంగా ఖరారైంది. ఊహించినట్టుగానే పాక్, ఇంగ్లాండ్ మ్యాచ్ లో అద్భుతాలేమీ జరగలేదు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే పాక్ కథ ముగిసింది. దీంతో 10 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. సెమీఫైనల్ లో భారత్, కివీస్ తోనే తలపడనుండగా.. ఈ మ్యాచ్ కు ముంబై వాంఖేడే స్టేడియం వేదిక కానుంది. టోర్నీలో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్ కు సెమీస్ లో మాత్రం కివీస్ సవాల్ విసరనుంది. లీగ్ స్టేజ్ లో ఆ జట్టుపై విజయం సాధించే క్రమంలో రోహిత్ సేన కాస్త ఒత్తిడికి గురైంది. అలాగే గత రికార్డుల పరంగా వరల్డ్ కప్ లో ఆ జట్టుదే పైచేయిగా ఉంది.
ముఖ్యంగా 2019 వరల్డ్ కప్ సెమీస్ లో కివీస్ పై పరాభవాన్ని భారత అభిమానులు ఎవ్వరూ మరిచిపోలేరు. ధోనీ రనౌట్ మ్యాచ్ ను మలుపుతిప్పడం సెమీస్ లోనే భారత్ ఇంటిదారి పట్టడం ఇప్పటికీ ఫ్యాన్స్ ను వెంటాడుతూనే ఉంది. దీంతో ఈసారి అప్పటి ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. లీగ్ స్టేజ్ లో ఈ రెండు జట్లు కూడా చక్కగా ఆడాయి.
Also Read: Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవే..!
ముఖ్యంగా సఫారీ జట్టు భారత్, నెదర్లాండ్స్ చేతిలో ఓడినప్పటకీ మిగిలిన మ్యాచ్ లలో అదరగొట్టింది. భారీ స్కోర్లతో దుమ్మురేపింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అద్భుతంగా పుంజుకుంది. లీగ్ స్టేజ్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఆసీస్ ఓడిపోయినా.. తర్వాత వరుసగా ఏడు విజయాలతో మూడో ప్లేస్ సాధించింది. భారత్, సౌతాఫ్రికా జట్ల చేతిలోనే కంగారూ టీమ్ పరాజయం పాలైంది. ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ ఆసీస్ కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. రెండో సెమీస్ కు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. అయితే రెండు సెమీఫైనల్స్ లోనూ అభిమానుల అంచనాలకు తగిన జట్లే ఆడనుండడంతో హోరాహోరీ పోరు ఖాయమని చెప్పొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.