RCB vs SRH: ఆర్‌సీబీ బౌలర్లకు మళ్లీ దబిడిదిబిడే బెంగళూరుతో మ్యాచ్‌కు సన్‌రైజర్స్ రెడీ

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు...ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది...అసలు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి.

RCB vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు…ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది…అసలు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. విధ్వంసమే లక్ష్యంగా ఆడుతున్నారు. ట్రావిడ్ హెడ్‌, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఈ ముగ్గురూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సింగిల్స్ మరిచిపోయినట్టు… బౌండరీలు, సిక్సర్లు మాత్రమే కొడుతుండడంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. బ్యాటర్ల జోరుతో భారీస్కోర్లు సాధిస్తూ ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పటిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు హోంగ్రౌండ్‌లో మ్యాచ్‌కు సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసింది. ఈ మూడింటిలో ఒకసారి ఉప్పల్ స్టేడియంలోనే ముంబైపై భారీస్కోర్ చేసింది.

బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్‌ కుమార్‌రెడ్డి, క్లాసెన్ దుమ్మురేపుతున్నారు. హెడ్‌ అయితే టీ ట్వంటీల్లో ఎలా ఆడాలో తన బ్యాట్‌తోనే చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ 6 మ్యాచ్‌లలో 324 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ ఓపెనర్లు గత మ్యాచ్‌లో పవర్ ప్లేలో రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రతీ మ్యాచ్‌కు తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ అదరగొడుతున్న సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లోనూ అద్భుతంగా ఉంది. కమ్మిన్స్, భువనేశ్వర్ , నటరాజన్, మయాంక్ మర్కాండే కీలకంగా ఉన్నారు. ఆడిన ఏడు మ్యాచ్‌లో ఐదు గెలిచిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ను అడ్డుకోవడం రాయల్ ఛాలెంజర్స్‌కు సవాల్‌గానే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో అత్యంత చెత్త బౌలింగ్‌ టీమ్‌గా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌సీబీ బౌలర్లు సన్‌రైజర్స్ బ్యాటర్లను అడ్డుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీనికి తోడు హోంగ్రౌండ్‌లో ఆడుతుండడం హైదరాబాద్‌కు మరో అడ్వాంటేజ్.

We’re now on WhatsAppClick to Join

ఈ సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్‌సీబీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి రివేంజ్ తీర్చుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఇప్పటికే 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆర్‌సీబీపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడం ఒక్కటే ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. పేలవ ప్రదర్శనతో తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. ఓపెనర్లుగా ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరికి హైదరాబాద్ బౌలర్లపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా హైదారబాద్‌లో కోహ్లీ పరుగుల వరద పారించాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్‌ కోసం అభిమానులు పోటెత్తడం ఖాయం. ఇప్పటికే టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. మొత్తం మీద బెంగళూరు పేలవ బౌలింగ్‌, ఉప్పల్ స్టేడియం ఫ్లాట్ వికెట్ కలిసి సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Rajveer Singh Diler: బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ సింగ్ మృతి