ODI Team Captain: అక్టోబర్‌లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనున్నారు. అయితే ఈ సిరీస్ రోహిత్ శర్మకు చివరి వన్డే సిరీస్ కావచ్చని, ఆ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్ అయితే అతని తర్వాత భారత జట్టు పగ్గాలు (ODI Team Captain) ఎవరు చేపడతారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
శ్రేయస్ అయ్యర్ కాదు, శుభ్‌మన్ గిల్ అవుతాడా?
టీమిండియా మాజీ క్రికెటర్ మరియు ప్రముఖ కామెంటేటర్ అయిన ఆకాష్ చోప్రా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన ప్రకారం.. భారత వన్డే జట్టు తదుపరి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికవుతాడని వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
Also Read: Indian Test Players: ఈ ఏడాది టీమిండియాకు గుడ్‌బై చెప్పిన ఐదుగురు స్టార్ క్రికెటర్లు వీరే!
ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. “మార్కెట్‌లో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ భారత వన్డే కెప్టెన్ అవుతాడని, ఈ రేసులో శుభ్‌మన్ గిల్‌ను అధిగమిస్తాడని అంటున్నారు. అయితే నా దృష్టిలో తదుపరి కెప్టెన్ ఇప్పటికే అనధికారికంగా ఖరారయ్యాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు శుభ్‌మన్ గిల్” అని స్పష్టం చేశారు.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి గల కారణాలు
శుభ్‌మన్ గిల్ టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి బలమైన కారణాలు ఉన్నాయి. యువ ప్లేయర్ గిల్ వయస్సు 26 సంవత్సరాలు. ఇది అతని కెప్టెన్సీ ప్రయాణానికి సుదీర్ఘ కాలం అందిస్తుంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇప్పటికే టీమిండియాలో ఒక కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడు. ఈ అనుభవం అతనికి జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే శుభ్‌మన్ గిల్ భవిష్యత్ భారత క్రికెట్‌కు అత్యంత అనుకూలమైన నాయకుడిగా కనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా పగ్గాలు శుభ్‌మన్ గిల్ చేతిలో ఉంటాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఆకాష్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.