Rishabh Pant Health : రిషబ్ పంత్ ఈ ఏడాదంతా క్రికెట్ కి దూరమే…

ఒక్క యాక్సిడెంట్‌ (Accident) అతని క్రికెట్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టింది... కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స

ఒక్క యాక్సిడెంట్‌ అతని క్రికెట్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టింది… కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ (Rishabh Pant) మళ్ళీ ఎప్పుడు గ్రౌండ్‌లోకి అడుగుపెడతాడు… పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఎన్ని నెలలు పడుతుంది. ఈ ఏడాదికి అతన్ని గ్రౌండ్‌లో చూడడం కష్టమేనా… ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి.

క్రికెటర్లు మ్యాచ్ ఆడుతూ గాయపడడం సాధారణంగా చూస్తుంటాం.. అయితే ఆఫ్ ది ఫీల్డ్‌లో దురదృష్టవశాత్తూ గాయపడడం ఇటీవల జరుగుతోంది. గత నెలలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అనూహ్యంగా కారు ప్రమాదానికి గురయ్యాడు. పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నుదుటిపైనా, వీపుపై గాయాలు, కుడి మోకాలి లిగ్మెంట్ ప్రాక్చర్ అయింది. ముందు డెహ్రడూన్‌లో చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం తర్వాత ముంబైకి తరలించారు. బీసీసీఐతో పాటు డీడీసీఎ పంత్ ట్రీట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే రిషబ్ పంత్ మళ్ళీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంత కాలం పడుతుందనేది తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రతలో కాలిన గాయాలు ఉండడం, లిగ్మెంట్‌ ప్రాక్చర్‌తో పాటు మరికొన్ని గాయాలు ఉండడమే దీనికి కారణం. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్ట్ పాజిటివ్‌గానే ఉన్నా పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.

అయితే ముంబైలో కొన్ని రోజుల చికిత్స అందించిన తర్వాత పంత్‌ను విదేశాలకు పంపించాలని బోర్డు భావిస్తోంది. సర్జరీల విషయంలో ప్రస్తుతం వైద్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని లండన్‌లో ట్రీట్‌మెంట్ అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆటగాళ్ళ గాయాలకు సర్జరీలు చేయించే విషయంలో బీసీసీఐ ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటుంది. పంత్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జైషా, బోర్డు వైద్యబృందంతో పాటు ఇతర డాక్టర్లను కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ట్రీట్‌మెంట్ అంతా పూర్తవడానికి కనీసం 9 నెలల వరకూ పడుతుందని అంచనా. దీంతో పంత్‌ ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌,ఆసియాకప్‌తో పాటు చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో సైతం ఆడే అవకాశాలు లేవు. సర్జరీల తర్వాత మునుపటిలా ఆడగలడా అన్న సందేహాలు ఉన్నప్పటకీ…పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రావాల్సి ఉంటుంది. మొత్తం మీద 9 నుంచి 10 నెలల పాటు యువవికెట్ కీపర్‌ పూర్తిగా ఇంటికే పరిమితమవనున్నాడు. కాగా ఏడాది పూర్తయ్యేసరికల్లా పంత్ పూర్తిగా కోలుకుని మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read:  Home Loan : గృహ రుణాలు చాలా రకాలు ఉన్నాయి.. అవేంటంటే..!