Site icon HashtagU Telugu

SRH Team: పేరులోనే హైదరాబాద్.. ఒక్క హైదరాబాదీ క్రికెటరూ లేడు

Not Even Single Player In Srh team

Not Even Single Player In Srh team

SRH Team : దేశవాళీ క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకునేందుకు చక్కని వేదిక ఐపీఎల్… లోకల్ ప్లేయర్స్ కు విదేశీ ఆటగాళ్ళతో ఆడే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకే ఐపీఎల్ ను ప్రారంభించారు. బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మెగా లీగ్ ద్వారా ఎంతోమంది యువక్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అన్ని ఫ్రాంచైజీలూ తమ తమ రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లకు అవకాశాన్ని కల్పించడం కామన్. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ సంప్రదాయానికి ఎప్పుడో ముగింపు పలికేసింది. తమిళనాడుకు చెందిన సన్ నెట్ వర్క్ యాజమాన్యం హైదరాబాద్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లకు చోటు కల్పించిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇక్కడి ఆటగాళ్ళకు మాత్రం చోటు లేదు. నిజానికి స్థానిక ఆటగాళ్లను చిన్నచూపు చూస్తుందంటూ మొదటి నుంచీ కూడా సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ సారి కూడా ఒక్క హైదరాబాద్ ప్లేయర్ కు కూడా టీమ్ లో ప్లేస్ లేదు. మినీ వేలంలో ఉన్న హైదరాబాద్, ఏపీలకు చెందిన యువక్రికెటర్లను వేరే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసినా.. సన్ రైజర్స్ కనీసం ప్రయత్నించలేదు. ప్రస్తుతం ఏపీకి చెందిన 19 ఏళ్ల నితీశ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం చోటు దక్కించుకున్నాడు.

వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన నితీశ్‌ను కూడా 2023 వేలం చివర్లో సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఒక్కరు కూడా తెలుగు ఆటగాడు లేకుంటే బాగోదని ఈ ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీకర్‌ భరత్‌, తిలక్‌ వర్మ వంటి ఆటగాళ్లను ఇతర ఫ్రాంచైజీలు మంచి ధరలకే కొనుగోలు చేశాయి. నిజానికి వారి బేస్ ప్రైస్ కూడా తక్కువగానే ఉన్నప్పటకీ.. సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌ మాత్రం పక్క రాష్ట్రాల ఆటగాళ్ళ వైపే ఆసక్తి కనబరిచింది. ప్రస్తుతం ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ చూసిన స్థానిక ఆటగాళ్ళ ప్రాతినిథ్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ లో మాత్రం నామ్ కే వాస్తే తరహాకే అది పరిమితం. స్థానిక ఆటగాళ్ళకు కూడా అవకాశాలివ్వాలన్న నిబంధనను బీసీసీఐ తప్పనిసరి చేస్తే తప్ప ఎస్ఆర్ హెచ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ క్రికెటర్లను పట్టించుకోదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల ఆటగాళ్ళను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పట్టించుకోకున్నా.. అభిమానులు మాత్రం ఆ జట్టు టైటిల్ గెలవాలని కోరుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ స్ఫూర్తితోనైనా రానున్న రోజుల్లో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం స్థానిక ఆటగాళ్ళకు ప్రాతినిథ్యం కల్పించాలని ఆశిద్దాం. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ మొదలు కానుండగా… సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను సొంతగడ్డపై ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది.

Also Read:  IPL: నిమిషాల్లోనే టిక్కెట్లు ఖతమ్(CSK vs LSG)

Exit mobile version