Watch This: స్లిప్‌లో 9 మంది ఫీల్డర్లు.. వీడియో వైరల్.. రొమేనియా, నార్వే మ్యాచ్ లో ఏమైందంటే!!

క్రికెట్‌ మ్యాచ్ లో స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ అయితే చివరకు నలుగురు ఫీల్డర్లు ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 11, 2022 / 03:54 PM IST

క్రికెట్‌ మ్యాచ్ లో స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ అయితే చివరకు నలుగురు ఫీల్డర్లు ఉంటారు. ఇక టెస్ట్ క్రికెట్ అయితే ఐదుగురు ఫీల్డర్లు ఉంటారు. అయితే ఏకంగా తొమ్మిది మంది స్లిప్‌ ఫీల్డర్లు ఉండడం ఎక్కడా చూసి ఉండరు. యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్లిప్‌లో ఏకంగా 9 మంది ఫీల్డర్లు ఫీల్డింగ్ చేశారు. కీపర్‌, బౌలర్‌ తప్పితే మిగతా తొమ్మిది మంది స్లిప్‌లోనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

తొమ్మిది మంది ఫీల్డర్లు వర్సెస్ బ్యాటర్..

యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్‌ జరిగింది. రొమేనియా ఇన్నింగ్స్‌ సమయంలో నార్వే జట్టు స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. ఏకంగా తొమ్మిది మంది ఫీల్డర్లను చూసి.. బ్యాటర్‌ అస్సలు భయపడలేదు. బ్యాటర్‌ చాలా తెలివిగా ఆఫ్ సైడ్ షాట్ ఆడాడు. చివరి ఫీల్డర్ దగ్గరలోంచి వెళ్లిన బంతి బౌండరీ వద్దకు వెళ్ళింది. ఫీల్డర్ బంతిని ఛేజ్ చేసేలోగా.. బ్యాటర్‌ రెండు పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచులో నార్వే జట్టు 43 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రొమేనియా నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 54 పరుగులకే పరిమితం అయింది. మ్యాచ్‌ గెలుస్తామన్న ధీమా వచ్చిన తర్వాతే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను పెట్టినట్టు నార్వే కెప్టెన్‌ చెప్పాడు. ఈ వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు.. ” స్లిప్‌లోనే జట్టు మొత్తం కనిపిస్తుంది.. ఇదేం ఫీల్డింగ్‌” అంటూ నోరెళ్లబెట్టారు.