Team India: తొలి టీ ట్వంటీకి భారత్ తుది జట్టు ఇదే

ఇంగ్లాండ్‌తో మూడు టీ ట్వంటీల సిరీస్‌కు గురువారం నుంచే తెరలేవనుంది. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఇరు జట్లూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 09:42 PM IST

ఇంగ్లాండ్‌తో మూడు టీ ట్వంటీల సిరీస్‌కు గురువారం నుంచే తెరలేవనుంది. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఇరు జట్లూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయం పాలైన భారత్ పొట్టి ఫార్మేట్‌లో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది.

టీ ట్వంటీ ప్రపంచకప్‌కు సన్నాహాక సిరీస్‌లు ఇంకా 4 మాత్రమే మిగిలిన వేళ జట్టు కూర్పుపై టీమిండియా దృష్టి పెట్టింది. దీంతో ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్ టూర్‌లో ఆడిన పలువురు యువ ఆటగాళ్ళకు తొలి టీ ట్వంటీలో చోటు దక్కనుంది. సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో యువ ఆటగాళ్ళకు మరోసారి చోటు కల్పించనున్నారు. తుది జట్టును చూసుకుంటే కెప్టెన్‌గా రీఎంట్రీ ఇస్తున్న రోహిత్‌శర్మ, యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు.

ఐర్లాండ్‌ టూర్‌లో అదరగొట్టిన దీపక్ హుడా వన్‌డౌన్‌లో రానుండగా.. సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ దిగనున్నాపు. ఐపీఎల్ 15వ సీజన్‌తో మళ్ళీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్‌ ఫినిషర్‌ రోల్‌ పోషించనున్నాడు. అటు బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్‌కుమార్‌తో పాటు హర్షల్ పటేల్‌కు చోటు ఖాయం. అయితే మూడో పేసర్‌గా అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్‌సింగ్ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

ఈ ముగ్గురూ కూడా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారు. ఐర్లాండ్ టూర్‌లో కూడా సత్తా చాటడం, వార్మప్ మ్యాచ్‌లో కూడా ఆకట్టుకున్న నేపథ్యంలో ఒకరిని ఎంచుకోవడం మేనేజ్‌మెంట్‌కు పరీక్షగానే చెప్పాలి. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, చాహల్‌కు చోటు దక్కనుంది. కాగా ఈ సిరీస్‌ రోహిత్‌శర్మకు కూడా సవాల్‌గానే భావిస్తున్నారు. టీ ట్వంటీ ప్రపంచకప్‌కు నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జట్టు కూర్పుపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీంతో ఇంగ్లాండ్ టూర్‌ నుంచే మెగా టోర్నీకి ఎంపికయ్యే ఆటగాళ్ళను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.