IND vs ENG: ఆకాశ్ చోప్రా తుది జట్టులో జడేజాకు నో ప్లేస్

ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 02:52 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారత తుది జట్టుపై పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన విశ్లేషణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి, శార్థూల్‌ ఠాకూర్‌, రవిచంద్ర అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆకాష్ చోప్రా సూచించాడు.

ఇంగ్లండ్‌ పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తాయని, అందుకే జడేజాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే బాగుంటుందన్నాడు. ఒక వేళ భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే షమీ, బుమ్రా, సిరాజ్‌ల పేస్ త్రయంతో బరిలోకి దిగాలని సూచించాడు. అక్కడ పరిస్థితుల బట్టి ఉమశ్‌ యాదవ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. అలాగే గత ఏడాది ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా ఉందన్న ఆకాశ్ చోప్రా ఈ సారి మాత్రం అందరూ మంచి ఫామ్ లో ఉన్నారని గుర్తు చేశాడు. దీంతో అత్యుత్తమ బౌలింగ్‌ ఎటాక్‌తోనే భారత్ బరిలోకి దిగాలని స్పష్టం చేశాడు. ఒకవేళ బౌలింగ్ కూర్పులో తప్పు చేస్తే భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం కష్టమేనని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు. గత ఏడాది ఆసీస్ గడ్డపై భారత పేసర్లు అద్భుతంగా రాణించారని, ఇంగ్లాండ్ పిచ్ లపైనా వారి జోరు కొనసాగే అవకాశముందన్నాడు. తుది జట్టులో జడేజా కంటే అశ్విన్, శార్థూల్ ఠాకూర్ వైపే మొగ్గుచూపడానికి కూడా కారణాలను చోప్రా వెల్లడించాడు.

వీరిద్దరూ బంతితో పాటు బ్యాట్ తోనూ రాణిస్తున్నారని, జడేజా బ్యాటింగ్ పరంగా పెద్దగా అంచనాలు అందుకోలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. కాగా కరోనా కారణంగా గత ఏడాది జరిగిన సిరీస్ లో ఒక మ్యాచ్ వాయిదా పడడంతో దానిని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో చివరి టెస్టును గెలిచినా, డ్రా చేసుకున్నా ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని టీమిండియా కైవసం చేసుకుంటుంది.