Site icon HashtagU Telugu

Pujara: అతనికి అనుకున్నంత గుర్తింపు రాలేదు

Pujara Rehane

Pujara Rehane

భారత టెస్ట్ జట్టులో రాహుల్ ద్రావిడ్ తర్వాత నయా వాల్ గా పిలుచుకునే ఆటగాడు చటేశ్వర పుజారా. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు తలనొప్పిగా మారిపోతాడు. డిఫెన్సివ్ బ్యాటింగ్ తో బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తాడు. చాలా సార్లు జట్టు ఓటమికి అడ్డుగోడలా నిలబడిన పుజారా గత ఏడాది పేలవ ఫామ్ తో సతమతమయ్యాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోవడంతో మళ్ళీ కౌంటీ క్రికెట్ ఆడి ఫామ్ అందుకున్నాడు.

ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టులో పుజారాపైనే అంచనాలున్నాయి. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని, అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లకు తగిన గుర్తింపు రాలేదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా అందరూ ఐపీఎల్‌లో ఆడుతున్నప్పడు.. పుజారా మాత్రం ఇంగ్లండ్‌ కౌంటీల్లో అడి తన ఫామ్‌ను తిరిగి పొందాడని కొనియాడాడు. పుజారాకు ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉండడం కలిసొస్తుందని చెప్పాడు. కౌంటీ క్రికెట్‌లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారనీ, ముఖ్యంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడి సెంచరీలు సాధించడం పెద్ద విషయమని అభివర్ణించాడు.

తాము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పుజారా అంతగా రాణిస్తాడని ఎవరూ ఊహించలేదని భజ్జీ గుర్తు చేసుకున్నాడు.. విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత తరపున పుజారా అద్భుతంగా ఆడుతాడని విశ్లేషించాడు. ఇంగ్లండ్‌లో పుజారా కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరన్నాడు. ఈ ఏడాది కౌంటీల్లో ఐదు ‍టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 700 పరుగులు సాధించాడు.