Site icon HashtagU Telugu

Dravid : తుది జట్టు ఎంపికపై ద్రావిడ్ ఏమన్నాడంటే…

Rahul Dravid Jasprit Bumrah

Rahul Dravid Jasprit Bumrah

ఇంగ్లాండ్ తో చివరి టెస్టులో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. కొందరు ఊహించినట్టుగానే 378 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ సునాయాసంగా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను కుప్పకూల్చిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. చివరిరోజు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై చర్చ మొదలైంది. అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి. అతని స్థానంలో జట్టులోకి తీసుకొచ్చిన శార్థూల్ నిరాశపరిచాడు. దీంతో అశ్విన్ ఆడించకపోవడం భారత్ చేసిన తప్పిదమంటూ అటు మాజీలు, ఇటు ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. దీంతో అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపైనా, ఓటమిపైనా ద్రావిడ్ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ, ఇక్కడా మంచి అవకాశాలు లభించినా వాటిని ఉపయోగించుకోలేకపోయామన్నాడు, బౌలింగ్‌లో ఒకే తరహా తీవ్రత, ఫిట్‌నెస్‌ మ్యాచ్‌ ఆసాంతం కొనసాగించలేకపోవడం నిరాశ కలిగించిందన్నాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యామని, ఇది ఓటమికి కారణంగా చెప్పుకొచ్చాడు.

ఇక జట్టు ఓడినప్పుడు తుది జట్టుపై చర్చ సహజమన్న ద్రావిడ్ శార్దుల్‌ బాగానే ఆడుతున్నాడు కాబట్టే మరో అవకాశమిచ్చామని వివరణ ఇచ్చాడు. అశ్విన్‌లాంటి సీనియర్ ఆటగాడిని తప్పించడం అంత సులువైన నిర్ణయం కాదన్నాడు.అయితే తొలి రోజు పిచ్‌ను చూసినప్పుడు పచ్చిక ఎక్కువగా కనిపించిందనీ, పేస్‌ బౌలర్లకు ఎక్కువ సహకరిస్తుందని భావించినట్టు ద్రావిడ్ తెలిపాడు. ఈ కారణంగానే అశ్విన్ కంటే శార్థూల్ వైపే మొగ్గుచూపినట్టు చెప్పాడు. అశ్విన్ ఉండి ఉంచే చివరి రోజు ప్రభావం చూపేవాడన్న అభిప్రాయంతో ద్రావిడ్ ఏకీభవించలేదు. పిచ్ చివరి రోజు అసలు టర్న్ కాలేదని గుర్తు చేశాడు. అయితే ఓటమికి సాకులు చెప్పదలుచుకోలేదని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ తమ కంటే బాగా ఆడింనందునే గెలిచిందన్నాడు.