IND vs SA : బబూల్ లేదు…టెస్టులు మాత్రం మస్ట్

భారత్, సౌతాఫ్రికా సిరీస్‌కు రెండు జట్ల ఆటగాళ్ళు సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ పలు ఆంక్షలు సడలించింది.

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 12:00 PM IST

భారత్, సౌతాఫ్రికా సిరీస్‌కు రెండు జట్ల ఆటగాళ్ళు సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ పలు ఆంక్షలు సడలించింది. బయోబబూల్‌ లేకుండానే భారత్,సఫారీ జట్ల మధ్య టీ ట్వంటీ సిరీస్ జరగబోతోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా బబూల్‌లోనే అంతర్జాతీయ సిరీస్‌లు జరుగుతున్నాయి. బబూల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్ళెవరూ స్టేడియం, హోటల్ దాటి బయటకు వెళ్ళకూడదు. ఈ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించిన ఆయా దేశాల బోర్డులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే హోటల్‌లో ఎవరూ కూడా ఆటగాళ్ళను కలిసేందుకు వీలులేదు. బయట నుంచి భోజనం తెప్పించుకోవడం, బయటకు వెళ్ళడం వంటివి నిషేధం. ఆటగాళ్ళతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అదుపులోకి రావడంతో బీసీసీఐ ఆంక్షలు ఎత్తివేసింది. దాదాపు రెండేళ్ళ తర్వాత బబూల్ లేకుండా ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోంది. అయితే బబూల్ నిబంధనలు సడలించినా కోవిడ్ నిబంధనలు పాటించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ళందరూ రెగ్యులర్‌గా కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందేనని తెలిపింది. అలాగే మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం మానొద్దని ఆదేశించింది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ చేరుకున్న సౌతాఫ్రికా క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించగా.. టీమిండియా క్రికెటర్లు సోమవారం నుంచి ప్రాక్టీస్ షురూ చేయనున్నారు.