Common Wealth 2022 : కామన్ వెల్త్ గేమ్స్ కు నిఖత్ క్వాలి ఫై

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో దుమ్మురేపిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్ వెల్త్ గేమ్స్ కు క్వాలిఫై అయింది

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 05:58 PM IST

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో దుమ్మురేపిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్ వెల్త్ గేమ్స్ కు క్వాలిఫై అయింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో నిఖత్ పవర్ పంచ్‌లతో అదరగొట్టింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన నిఖత్ తుది పోరులోనూ సత్తా చాటింది. ఢిల్లీ, ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ బౌట్ లో నిఖత్ 7-0 తేడాతో హర్యానా బాక్సర్ మీనాక్షి పై కూడాగెలిచి కామన్ వెల్త్ గేమ్స్ కు అర్హత సాధించింది. ఈ సెలక్షన్ ట్రయల్స్ ఆరంభం నుంచీ ప్రత్యర్థి బాక్సర్లపై నిఖత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఏ ఒక్క మ్యాచ్ లోనూ ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదంటే ఆమె జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఇస్తాన్ బుల్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనూ నిఖత్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళా బాక్సర్ గా రికార్డులకెక్కింది. ఇప్పుడు కామన్ వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ లోనూ అదే ఫామ్ కొనసాగించి అర్హత సాధించిన నిఖత్ కు తెలంగాణ క్రీడా శాఖ అభినందలు తెలిపింది

మరోవైపు భారత మహిళా దిగ్గజ బాక్సర్‌.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనాలన్న ఆశలు ఆవిరయ్యాయి. ట్రయల్స్‌లో భాగంగా 48 కిలోల విభాగం సెమీస్‌ బౌట్‌లో నీతుతో మేరీ తలపడింది. అయితే, తొలి రౌండ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే ఎడమ మోకాలు మెలి పడటంతో మేరీ ఆ నొప్పిని భరించలేక పోటీ నుంచి వైదొలిగింది. దీంతో రెఫరీ నీతూను విజేతగా ప్రకటించడంతో మేరీ భావోద్వేగానికి గురవుతూ రింగ్‌ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్‌వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టినా ఇప్పుడు గాయంతో దూరమవడంతో తీవ్ర నిరాశకు గురైంది.