T20 World Cup 2022: వరల్డ్‌కప్‌ నుంచి ఆసీస్ ఔట్.. సెమీస్‌లో ఇంగ్లాండ్..!

టీ ట్వంటీ ప్రపంచకప్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది.

  • Written By:
  • Updated On - November 5, 2022 / 06:26 PM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ , శ్రీలంకపై గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్ళింది. ఈ మ్యాచ్‌లో లంక గెలిచి ఉంటే ఆసీస్ సెమీస్‌కు వెళ్ళేది. దీంతో సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో కంగారూలు సెమీస్‌ కూడా చేరలేకపోవడం ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 141 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక మెరుపు హాఫ్ సెంచరీ చేసినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అంచనాలు పెట్టుకున్న కుషాల్ మెండిస్, అసలంక, రాజపక్స , కెప్టెన్ శనక తక్కువ స్కోరుకే ఔటయ్యారు.ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, స్టోక్స్, వోక్స్, శామ్ కురాన్,. రషీద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

బౌలింగ్‌లో లంక బౌలర్లు తేలిపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోరును అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తొలి వికెట్‌కు బట్లర్, హేల్స్ 78 పరుగులు జోడించారు. బట్లర్ 28 , హేల్స్ 47 పరుగులకు ఔటవగా.. బెన్ స్టోక్స్ 42 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే చివర్లో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రూక్ , లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ ఔటయ్యారు. చివరికి ఇంగ్లాండ్ 19.2 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరింది. రేపటి మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ గెలిస్తే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.