New Zealand Win: భారత పర్యటనను న్యూజిలాండ్ ఘన విజయంతో (New Zealand Win) ఆరంభించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరిరోజు వర్షం కాపాడుతుందేమో, బౌలర్లు అద్భుతం ఏదైనా చేస్తారేమోనని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఆరంభంలో బూమ్రా రెండు వికెట్లు తీసినా తర్వాత కివీస్ బ్యాటర్లు నిలదొక్కుకున్నారు.
కివీస్ సారథి టామ్ లాథమ్ డకౌటవగా… బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బందిపడిన డెవాన్ కాన్వే 17 రన్స్ కు ఔటయ్యాడు. అయితే రచిన్ రవీంద్ర, యంగ్ నిలకడగా ఆడి కివీస్ ను గెలిపించారు. టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని అందుకున్నారు. కొత్తబంతితో తొలి 13 ఓవర్లు మాత్రమే భారత పేసర్లు బూమ్రా, సిరాజ్ కివీస్ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టగలిగారు. స్పిన్నర్లు కూడా పెద్ద ప్రభావం చూపలేకపోవడంతో న్యూజిలాండ్ తొలి సెషన్ లోనే మ్యాచ్ ను ముగించింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని వేగంగా కరిగించాడు. రచిన్ రవీంద్ర 6 ఫోర్లతో 39 , యంగ్ 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు. 1988 తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ కు ఇదే తొలి విజయం.
Also Read: T20 World Cup Final: నేడే మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు.. గెలుపెవరిదో..?
ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నిజానికి తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్ల అట్టర్ ఫ్లాప్ ఈ ఓటమికి కారణమైంది. ఎవ్వరూ ఊహించని విధంగా 46 పరుగులకే కుప్పకూలడం, తర్వాత కివీస్ ఇదే పిచ్ పై 400 పైగా స్కోర్ చేయడంతో టీమిండియా వెనుకబడింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం భారత్ పుంజుకుంది. టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో మంచి స్కోరే సాధించింది.
కోహ్లీ, రోహిత్ హాఫ్ సెంచరీలు చేయగా… సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. ముఖ్యంగా సర్ఫరాజ్ చాలా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ, పంత్ లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు. అటు పంత్ కూడా ఆకట్టుకున్నాడు. గాయంతో బాధపడుతూనే 99 పరుగులు చేశాడు. అయితే పంత్ , సర్ఫరాజ్ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో టీమిండియా పెద్ద టార్గెట్ ను కివీస్ ముందు ఉంచలేకపోయింది. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా క్రీజులో కాసేపు ఓపిగ్గా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద బ్యాటర్ల ఫ్లాప్ షో కారణంగా తొలి టెస్టులో భారత్ కు ఓటమి తప్పలేదు. సొంతగడ్డపై ఒకవిధంగా ఇది భారత్ కు జీర్ణించుకోలేని ఓటమిగానే చెప్పాలి. కాగా మూడు టెస్టుల సిరీస్ లో రెండో టెస్ట్ అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా జరుగుతుంది.