Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్ పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్‌లో శుభారంభం చేసింది.

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 10:40 PM IST

Kiwis T20: వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్ పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్‌లో శుభారంభం చేసింది. రాంఛీ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారీస్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు ఫిలెన్‌ , కాన్వే మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. వాషింగ్టన్ సుందర్ ఓకే ఓవర్లో అలెన్‌ , చాప్‌మన్‌లను పెవిలియన్‌కు పంపాడు. అలెన్ 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 రన్స్ చేయగా.. కాన్వే 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా త్వరగానే ఔట్ చేసినప్పటికీ మిఛెల్ కివీస్‌ను ఆదుకున్నాడు. భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎటాకింగ్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన మిఛెల్ కేవలం 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో అర్షదీప్‌సింగ్‌ పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచాడు. ఈ ఓవర్లో మిఛెల్ 27 పరుగులు సాధించాడు. అర్షదీప్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చుకున్నాడు.

177 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ 4 పరుగులకే ఔటవగా… రాహుల్ త్రిపాఠీ డకౌటయ్యాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌గిల్ కూడా నిరాశపరచడంతో భారత్ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్. హార్థిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. వీరి పార్టనర్‌షిప్‌ బ్రేక్ అవడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న దీపక్ హుడా 10 రన్స్‌కే వెనుదిరిగాడు. అయితే వికెట్లు పడుతున్నా వాషింగ్టన్ సుందర్‌ ఒంటరి పోరాటం చేసాడు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో సుందర్ హిట్టింగ్ సరిపోలేదు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి మరో బ్యాటర్ సపోర్ట్ లభించి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలింగ్ ఆకట్టుకుంది. కెప్టెన్ మిఛెల్ శాంట్నర్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 1 మెయిడెన్‌ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చిన కివీస్ సారథి 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లు కూడా కీలక సమయంలో భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.