Rajasthan Match Fixing: ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు (Rajasthan Match Fixing) రాగా.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ.. సంజూ శాంసన్ నాయకత్వంలోని ఈ జట్టుపై పలు ప్రశ్నలు లేవనెత్తాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. కానీ ఇప్పుడు ఈ వివాదంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కానీ ఈ రెండు మ్యాచ్‌లలోనూ చివరి వరకు జట్టు ఆధిపత్యంలో ఉంది. రెండు మ్యాచ్‌లలోనూ చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైనప్పుడు, చాలా వికెట్లు మిగిలి ఉండగా సరైన బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ సూపర్ ఓవర్‌లో ఓడిపోగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటముల తర్వాత బిహానీ జట్టుపై సందేహాలు వ్యక్తం చేశాడు.
టిక్కెట్ల కేటాయింపు తక్కువ కావడమే అసంతృప్తికి కారణమా?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA)కి సాధారణం కంటే తక్కువ టిక్కెట్లు కేటాయించడం అసంతృప్తికి కారణం కావచ్చు. సాధారణంగా ప్రతి మ్యాచ్‌కు RCAకి 1800 టిక్కెట్లు ఇవ్వబడేవి. కానీ ఈ సంవత్సరం ఈ సంఖ్యను తగ్గించారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ RCAకి మ్యాచ్‌కు 1000 నుండి 1200 టిక్కెట్లు మాత్రమే ఇస్తోంది.
రాజస్థాన్ రాయల్స్‌తో సంబంధం ఉన్న ఒక మూలం ప్రకారం.. సీజన్ ప్రారంభంలో BCCI మాకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. RCA రద్దు చేయబడినందున అన్ని ఏర్పాట్ల కోసం మేము రాజస్థాన్ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ (RSSC)తో సంప్రదిస్తాము అని పేర్కొన్నారు. ఆ మూలం మరింత చెబుతూ.. RCAలోని అసంతృప్త సభ్యులు, వారి సహచరులు ఎక్కువ టిక్కెట్లు కోరుతున్నారు. మేము వారి డిమాండ్‌ను అంగీకరించడం లేదు. ఈ డ్రామా వెనుక ఇదే ఏకైక కారణమని తెలిపినట్లు నివేదిక పేర్కొంది.
BCCI అధికారి ఒకరు పేరు వెల్లడించకుండా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. “ప్రస్తుతం RCA రద్దు చేయబడింది. ఎన్నికలు జరిగే వరకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయబడింది. అందుకే ఈ డ్రామా జరుగుతోంది. అందరూ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. BCCI వద్ద అవినీతి నిరోధక యూనిట్ ఉంది. ఇది చెడు అంశాలను క్రీడ నుండి దూరంగా ఉంచడానికి 24 గంటలూ పనిచేస్తుంది. ఈ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదు అన్నారు.
Also Read: KL Rahul: లక్నోపై కసి తీర్చుకున్న కేఎల్ రాహుల్.. గోయెంకాను పట్టించుకోని కేఎల్, వీడియో వైరల్!
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ స్పందన
ఈ ఆరోపణల సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మేము ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చుతున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు వ్యాప్తి చేయడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు, RMPL, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, BCCI ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవి క్రికెట్ క్రీడ సమగ్రతను కూడా కలుషితం చేశాయని పేర్కొన్నారు. రాజస్థాన్ జట్టు టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహణ కోసం రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, BCCIతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. యశస్వీ జైస్వాల్ (74) బాగా ఆడినప్పటికీ చివరి ఓవర్‌లో ఆవేష్ ఖాన్ (3/37) అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్‌ను ఆపాడు. ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని BCCI స్పష్టం చేసింది.