IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ మ్యాచ్ కూ ఒక్కో ప్లేయర్ కూ అదనంగా ఏడున్నర లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. దీని ప్రకారం చూస్తే సీజన్ మొత్తం ఆడితే ప్లేయర్స్ ఖచ్చితంగా కోటి రూపాయల పైనే ఆర్జించనున్నారు. అంటే వేలంలో తమకు చెల్లించే మొత్తానికి ఇది అదనం. ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా బీసీసీఐ(BCCI) సెక్రటరీ జైషా ప్రకటించారు. దీని కోసం ప్రతీ ఫ్రాంచైజీకి 12.60 కోట్ల రూపాయలను మ్యాచ్ ఫీజుగా కేటాయించనున్నట్టు తెలిపారు. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగా వేలం ముంగిట ఇది చారిత్రక నిర్ణయంగా జైషా అభివర్ణించారు. ప్రతీ ప్లేయర్ ప్రదర్శనకు ఇది గొప్ప బహుమతిగా, ప్రోత్సాహకంగా ఉంటుందని జైషా ట్వీట్ చేశారు.
(IPL 2025) ఒకవిధంగా ఈ నిర్ణయంతో యువక్రికెటర్లందరూ జాక్ పాట్ కొట్టినట్టే… ఇప్పటికే వేలంలో పలువురు యంగస్టర్స్ కోట్లాది రూపాయలు పలుకుతున్నారు. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఇంకా అదనంగా డబ్బు రానుంది. అలాగే అన్ క్యాప్డ్ కేటగిరీలో కనీస ధరకు అమ్ముడైన ప్లేయర్స్ తుది జట్టులో చోటు దక్కించుకుంటే కాంట్రాక్ట్ ఫీజు కాకుండా ప్రతీ మ్యాచ్ కూ రూ.7.5 లక్షల చొప్పున అందుకుంటారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ పై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన చేయకున్నా ఫ్రాంచైజీలకు మేలు కలిగేలా బీసీసీఐ నిర్ణయాలున్నట్టు సమాచారం. రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదు పెంచడంతో పాటు రైట్ టూమ్ మ్యాచ్ రూల్ ను మళ్ళీ తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్ల వరకూ పెంచబోతున్నారు. గత వేలంలో ఇది 90 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో 30 కోట్లు పెంచుతున్నారు.
Also Read: Women Warns Hydra: హైడ్రా వస్తే చస్తానో, చంపేస్తానో చూద్దాం: మహిళ ఆగ్రహం