Site icon HashtagU Telugu

Shikhar Dhawan: సెలక్టర్లపై గబ్బర్ సంచలన వ్యాఖ్యలు

Dhawan

Dhawan

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ టీ ట్వంటీ కెరీర్ ఇక ముగిసినట్టేనా…యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైన వేళ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లాన్స్ లో గబ్బర్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంగా భారత్ క్రికెట్ జట్టు సాధించిన విజయాల్లో ఓపెనర్ శిఖర్ ధావన్ రోల్ చాలానే ఉంది. రోహిత్ తో కలిసి ఎన్నో సందర్భాల్లో భారీ స్కోర్లకు పునాది వేశాడు. సుదీర్ఘ కాలం టాపర్డర్ లో కీలక ఆటగాడిగా ఉన్నాడు.

అలాంటి ధావన్ కు ప్రస్తుతం జట్టులో సుస్థిర స్థానం లేదు. కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమవుతున్న అతడిని సెలక్టర్లు టీ ట్వంటలు, టెస్టులకు ఎంపిక చేయడం లేదు. పరిమిత ఓవర్లో క్రికెట్‌లో రాణిస్తున్న గబ్బర్‌ను టీ20లకు దూరంగా పెట్టడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ధావన్ కూడా స్పందించాడు. టీమిండియా-బీ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న తనను టీ ట్వంటీల్లో ఎందుకు తీసుకోవడం లేదో తెలియట్లేదన్నాడు. ఏదోక కారణమైతే ఉండి ఉంటుందనీ, ఈ విషయంపై మరింత లోతుగా ఆలోచించదలచుకోలేదన్నాడు . అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి పెడతానని చెప్పాడు. అది భారత టీ20 లీగ్, వన్డేలు ఏదైనా సరే మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాననీ తెలిపాడు.

ఆట పరంగా మాత్రమే మన నియంత్రణలో ఉండే అంశమని ధావన్ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ రవిశాస్త్రీ గురించి కూడా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి ఎనర్జీ పూర్తిగా విరుద్ధమనీ, ప్రతి ఒక్కరి తమకంటూ ఓ కోచింగ్ స్టైల్ ఉంటుందన్నాడు. రవిశాస్త్రీ ఉంటే అక్కడ వాతావరణం వేరుగా ఉంటుందనీ ధావన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇద్దరితోనూ తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని గబ్బర్ చెప్పుకొచ్చాడు.
శిఖర్ ధావన్ ప్రస్తుతం వన్డేల్లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ శర్మ లేనప్పుడు వన్డే జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version