Site icon HashtagU Telugu

RCB Women’s Team: అదే కథ.. అదే వ్యథ

Netizens Troll Rcb Women's Team After 5th Successive loss

Netizens Troll Rcb Women's Team After 5th Successive loss

ఈ సాలా కప్‌ నమ్మదే.. ఐపీఎల్ లో ప్రతీసారీ బెంగళూరు పఠించే మాట.. గ్రౌండ్ లోకి వచ్చేసరికి మాత్రం ఫ్లాఫ్ షో.. 15 ఏళ్ళలో కేవలం 3 సార్లు మాత్రమే ఫైనల్ చేరితే.. మిగిలిన సీజన్లలో పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే. ఇప్పుడు పురుషుల జట్టు తరహాలోనే ఆర్ సీబీ మహిళల జట్టు కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. దీంతో మా రాత ఇంతేనా అనుకుంటున్నారు RCB ఫ్యాన్స్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ట్రోఫీ కోసం 15 ఏళ్ళుగా నిరీక్షిస్తోంది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఆర్ సీబీ ప్రదర్శన మాత్రం ప్రతీసారీ నిరాశపరుస్తోంది. కనీసం మహిళల ఐపీఎల్ తోనైనా తమ జట్టు రాత మారుతుందని బెంగళూరు ఫ్యాన్స్ ఆశించగా వారికి నిరాశే మిగులుతోంది. తాజాగా మహిళల ఐపీఎల్ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములతో సతమతమవుతోంది. టోర్నీ ఆరంభమై వారం రోజులు దాటినా ఆ జట్టు ఇంకా ఖాతానే తెరవలేదు. జట్టులో పలువురు స్టార్ క్రికెటర్లు, అభిమానుల ప్రోత్సాహం ఉన్నప్పటకీ.. అంచనాలను మాత్రం అందుకోలేకపోతోంది. పురుషుల జట్టు తరహలోనే పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. కోట్లు కుమ్మరించి ఏరికోరి ఎంచుకున్న కెప్టెన్‌ మంధన వ్యూహాలు రచించడంలో దారుణం‍గా విఫలమవుతుండగా.. ఢిల్లీ, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్లు సోఫీ డివైన్‌, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఎల్లీస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, మెగాన్‌ షట్‌ పర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ మంధన మాత్రం తన పూర్తిస్థాయి సత్తా ఇంకా చూపించలేదు.

బ్యాటింగ్‌ విషయంలో కాస్త పర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీతో మ్యాచ్‌లో షఫాలీ, లాన్నింగ్‌లకు కనీసం డాట్‌ బాల్‌ వేయలేక ఆర్సీబీ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ మినహాయించి, 19 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు. ముంబైతో మ్యాచ్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. దాదాపుగా అందరూ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆర్సీబీ బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇక నాలుగో మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై బెంగళూరు ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బ్యాటింగ్ లో 138 పరుగులకే ఔటవగా… బౌలింగ్ లో కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయారు. ఒక్క వికెట్ కూడా తీయలేక దారుణ ఓటమి చవిచూశారు. లీగ్‌లో ఆర్సీబీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే, మెన్స్‌ ఆర్సీబీలాగే ఈ జట్టు పరిస్థితి కూడా పేపర్‌పై పులిలా తయారవుతుంది. ఇప్పటికే 5 పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న ఆర్ సీబీకి ఇకపై ప్రతీ మ్యాచ్ గెలిచినా నాకౌట్ కు చేరుతుందన్న ఆశలు కనిపించడం లేదు. మిగిలిన మ్యాచ్ లు గెలిస్తే.. ప్లే ఆఫ్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

Also Read:  Unlimited Food: రూ.60కి తిన్నంత ఆహారం. వేస్ట్ చేసారో జరిమానా తప్పదు!