వన్డే ప్రపంచ కప్ (Cricket World Cup 2023)లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. మొన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ కు ఆఫ్గనిస్తాన్ షాక్ ఇస్తే…తాజాగా నెదర్లాండ్స్ (Netherlands) జట్టు సౌతాఫ్రికా (South Africa)పై సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా కుదించిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 245 ( 245 Runs) పరుగులు చేసింది. అసలు ఆరంభంలో నెదర్లాండ్స్ బ్యాటింగ్ చూసిన వారెవరూ ఆ జట్టు ఈ స్కోర్ సాధిస్తుందని అనుకోలేదు. ఓపెనర్లు నిరాశ పరచడంతో సరైన ఆరంభం కూడా దక్కలేదు. విక్రమ్ జీత్ సింగ్ 2 , మ్యాక్స్ ఓవుడ్ 18 విఫలమవగా.. కోలిన్ ఆకర్‌మన్ 2 రన్స్ కే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఎంగెల్‌బ్రెట్ 19, తేజ నిడమనూరు 20 కూడా పెద్దగా రాణించలేదు. దీంతో 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పెద్ద స్కోరు చేసేలా కనిపించలేదు.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (Scott Edwards) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టెయిలెండర్లతో కలిసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో వాన్ డర్ మెర్వ్ 19 బంతుల్లో 29, ఆర్యన్ దత్ 9 బంతుల్లో 23 నాటౌట్ ధనాధన్ షాట్లతో ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇచ్చారు. వీరిద్దరూ చెలరేగడంతో నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు చేయగలిగింది. స్కాట్ ఎడ్వర్డ్స్ 78 పరుగులు చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
బౌలింగ్ లోనూ నెదర్లాండ్స్ ఆకట్టుకుంది. ఆరంభం నుంచే ఆ జట్టు బౌలర్లు సఫారీ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. బవుమ, డికాక్, మక్రం, డసెన్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. దీంతో దక్షిణాఫ్రికా 44 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ , క్లాసెన్ ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. క్లాసెన్ ఔట్ అయ్యాక మిల్లర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.మిల్లర్ 43 రన్స్ కు ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమయింది. మిగిలిన బ్యాటర్లను ఔట్ చేసేందుకు నెదర్లాండ్స్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. చివర్లో కేశవ్ మహారాజ్ ధాటిగా ఆడినా ఫలితం దక్కలేదు. దక్షిణాఫ్రికా 207 పరుగులకు ఆలౌట్ అయింది.
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బిక్ 2 , వ్యాండర్ మెర్వ్ 2 , లీడ్ 2 , మేకరీన్ 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా శ్రీలంక , ఆస్ట్రేలియా పై గెలిచిన సఫారీ జట్టుకు ఈ ఓటమి షాక్ గానే చెప్పాలి. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన నెదర్లాండ్స్ ఇదే తొలి విజయం. కాగా రెండు వరుస సంచలనాలు నమోదవడంతో పసికూన జట్లు ఆడే మిగిలిన మ్యాచ్ లపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Read Also : Tension Stress : మనకు వచ్చే టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
