Zimbabwe vs Netherlands: జింబాబ్వే సెమీస్ అవకాశాలను దెబ్బతీసిన నెదర్లాండ్స్.!

టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12లో నెదర్లాండ్స్ తొలి విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 02:20 PM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12లో నెదర్లాండ్స్ తొలి విజయాన్ని అందుకుంది. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన నెదర్లాండ్స్ ఈ విజయంతో జింబాబ్వే అవకాశాలను దెబ్బతీసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 117 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్ విఫలమడంతో పాటు నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు మంచి స్కోర్ చేయలేకపోయింది. బౌలింగ్ పరంగా ఆకట్టుకుంటున్న నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ లోనూ సమిష్టిగా రాణించింది.

జింబాబ్వే కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరోసారి సికిందర్ రాజా, సీన్ విలియమ్స్ ఆ జట్టును ఆదుకున్నారు. సికిందర్ రాజా 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 రన్స్ చేయగా.. సీన్ విలియమ్స్ 28 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగిన స్కోర్ సాధించలేదు. నెదర్లాండ్స్ బౌలర్లలో మికిరెన్ 3, గ్లోవర్ 2 , రీడ్ 2, బీక్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్ లో నెదర్లాండ్స్ త్వరగానే బైబర్గ్ వికెట్ చేజార్చుకున్నా మరో ఓపెనర్ మాక్స్ డౌడ్ తన ఫామ్ కొనసాగించాడు. టామ్ కూపర్ తో కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 52 పరుగులకు ఔటయ్యాడు. కూపర్ 32 రన్స్ చేశాడు. దీంతో జింబాబ్వే 18 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఈ ఫలితంతో జింబాబ్వే సెమీస్ బెర్త్ అవకాశాలు దాదాపుగా దూరమయ్యాయి.