Nepal Cricket Team: బద్దలైన యువరాజ్ రికార్డు.. టీ ట్వంటీ క్రికెట్‌లో నేపాల్ సరికొత్త చరిత్ర

వరల్డ్ క్రికెట్‌లో టాప్ టీమ్స్‌ను మాత్రం రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా చాలా మంది భావిస్తారు. ఒక్కోసారి పసికూనలు కూడా సంచలన ప్రదర్శనతో అదరగొడుతుంటాయి. తాజాగా నేపాల్ (Nepal Cricket Team) ఇదే తరహా ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.

Published By: HashtagU Telugu Desk
Nepal Cricket Team

Compressjpeg.online 1280x720 Image (3) 11zon

Nepal Cricket Team: రికార్డులనేవి ఎప్పుడూ బద్దలవుతూనే ఉంటాయి.. సరికొత్త రికార్డులు నమోదుతూనే ఉంటాయి. క్రికెట్‌లో అయితే రికార్డుల గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు గణాంకాలు మారిపోతూనే ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అయితే వరల్డ్ క్రికెట్‌లో టాప్ టీమ్స్‌ను మాత్రం రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా చాలా మంది భావిస్తారు. ఒక్కోసారి పసికూనలు కూడా సంచలన ప్రదర్శనతో అదరగొడుతుంటాయి. తాజాగా నేపాల్ (Nepal Cricket Team) ఇదే తరహా ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ వేదికగా రికార్డులు నెలకొల్పింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ భారీ స్కోర్ చేసింది. మంగోలియా బౌలింగ్‌ను చీల్చిచెండాడిన నేపాల్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది. టీ ట్వంటీల్లో ఇదే అత్యధిక స్కోర్. నేపాల్ ప్రదర్శనతో ఆప్ఘనిస్థాన్ పేరిట ఉన్న టీ ట్వంటీల్లో అత్యధిక స్కోర్ రికార్డు బద్దలయింది.

ఇదే మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. టీ ట్వంటీ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, ఫాస్టెట్ సెంచరీ రికార్డులను కూడా నేపాల్ తన ఖాతాలో వేసుకుంది.ఆ జట్టు క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మాట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సఫారీ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ, మిల్లర్ 35 బంతుల్లో టీ ట్వంటీ శతకం సాధిస్తే.. ఇప్పుడు కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఓవరాల్‌గా కుశాల్ మల్లా 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Also Read: Australia Worst Record: ఈరోజు జరిగే వన్డేలో ఆస్ట్రేలియా ఓడిపోతే ఓ చెత్త రికార్డు ఖాయం..!

ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కూడా నమోదైంది. నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ కేవలం 9 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు. చివరి 2 ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపేంద్రసింగ్ భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఏకంగా 8 సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా నేపాల్ బ్యాటర్ల విధ్వంసంతో మంగోలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఒక్కో బౌలర్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌లోనూ మంగోలియా చేతులెత్తేసింది. కేవలం 41 పరుగులకే కుప్పకూలింది.ఒకే ఒక్క బ్యాటర్ రెండంకెల స్కోర్ సాధించగా.. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో నేపాల్ 273 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో ఇదే భారీ విజయం.

  Last Updated: 27 Sep 2023, 11:40 AM IST