TEAM INDIA : డాక్యుమెంటరీగా టీమిండియా చారిత్రక విజయం

భారత క్రికెట్ లో ఆసీస్ గడ్డపై విజయం ఎప్పుడూ చిరస్మరణీయమే... ఎందుకంటే వారి పిచ్ లపై కంగారూ పేస్ ధాటిని తట్టుకుని ఆసీస్ ను ఓడించడం అంత ఈజీ కాదు. ఆసీస్ తో అంత ఈజీ కాదమ్మా అన్న మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 12:34 PM IST

భారత క్రికెట్ లో ఆసీస్ గడ్డపై విజయం ఎప్పుడూ చిరస్మరణీయమే… ఎందుకంటే వారి పిచ్ లపై కంగారూ పేస్ ధాటిని తట్టుకుని ఆసీస్ ను ఓడించడం అంత ఈజీ కాదు. ఆసీస్ తో అంత ఈజీ కాదమ్మా అన్న మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే గత కొన్నేళ్ళుగా ఆస్ట్రేలియా ఆధిపత్యానికి చెక్ పెడుతూ వారిని వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది టీమిండియా. చాలా కాలంగా భారత్ కు అందని ద్రాక్షలా ఉండిపోయిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఒకసారి కాదు వరుసగా రెండుసార్లు గెలవడం అంటే అదొక చారిత్రక ఘట్టం. 2018-19లోనే తొలిసారి ఆసీస్ పై టెస్ట్ సిరీస్ గెలిచినా… 2021 టెస్ట్ సిరీస్ విజయం మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు… పలువురు సీనియర్ ఆటగాళ్ళు దూరమవడం.. అంతగా అనుభవం లేని బౌలర్లు.. అన్నింటికీ మించి తొలి టెస్టులో 36 రన్స్ కే ఆలౌటై ఘోరపరాభావాన్ని మూటగట్టుకున్న జట్టు మళ్ళీ పుంజుకుని సిరీస్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రహానే సారథ్యంలోని భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చారిత్రక విజయాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారు బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. డాక్యుమెంటరీ రూపంలో బంధన్‌ మే తా ధమ్‌’ పేరుతో సిరీస్‌ను నిర్మించాడు.

ఈ పర్యటన తొలి టెస్టులోనే భారత్ 36 పరుగులకే కుప్పకూలడం.. తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం.. అనంతరం అద్భుతంగా పుంజుకుని సిరీస్ గెలవడం ఒక చారిత్రక విజయంగా మిగిలిపోయింది. అడిలైడ్‌ టెస్ట్‌లో ఓటమి అనంతరం, రహానే సారథ్యంలో టీమిండియా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో గెలుపొందింది. రహానే సూపర్ సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ డ్రా కాగా, సిరీస్‌ డిసైడర్‌ నాలుగో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన టీమిండియా అద్భుత విజయంతో సిరీస్‌ను ముగించింది. చివరి టెస్టులో విహారి, పంత్ రాణించడంతో 328 పరుగుల టార్గెట్ ను ఛేదించి ఛేదించడం ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఈ పర్యటన ఆరంభం నుంచీ భారత జట్టు ప్రయాణాన్ని డాక్యుమెంటరీ రూపంలో నీరజ్ పాండే తెరకెక్కించారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను అజింక్యా రహానే, సిరాజ్‌​, హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌, చతేశ్వర్‌ పుజారా విడుదల చేశారు.