World Athletics Championships: వర‌ల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో నీర‌జ్ చోప్రాకు చారిత్రాత్మక ర‌జ‌తం

భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో రజత పతకం గెలుచుకున్నాడు.

  • Written By:
  • Updated On - July 24, 2022 / 10:48 AM IST

భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో రజత పతకం గెలుచు కున్నాడు. ఇవాళ ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెని 88.13 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా, రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ని భారతదేశానికి సాధించిపెట్టాడు.

పారిస్ వేదికగా 2003లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ లో అంజు బాబీ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం గెలిచారు. 19 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పతకం గెలిచిన రెండో అథ్లెట్‌గా నీరజ్ నిలిచాడు.

పోటీ ఇలా జరిగింది..

నీరజ్ చోప్రా ఫౌల్ త్రోతో త‌న ఆట ప్రారంభించాడు. తన రెండో ప్రయత్నంతో 82.39 మీటర్ల దూరం విసిరాడు. ఆయ‌న తన మూడో ప్ర‌య‌త్నంలో  86.37 మీటర్లు విసిరి కొంచెం మెరుగుప‌డ్డారు. కానీ తన నాల్గో ప్రయత్నంతో 88.13 మీటర్ల త్రోను విసిరి ఏకంగా నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నారు.

ఆయ‌న ఐదో, ఆరో ప్ర‌య‌త్నాలు ఫౌల్ త్రోలు అయ్యాయి.  అయితే గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల బెస్ట్ త్రోతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. పీటర్స్ తన మొదటి ప్రయత్నంలో 90.21 మీటర్లు విసిరి, ఆపై తన రెండో ప్ర‌య‌త్నంలో 90.46 మీటర్లతో మెరుగ్గా నిలిచారు.

ఆయ‌న తన ఆరో ప్రయత్నంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ 88.09 మీటర్ల బెస్ట్ త్రోతో కాంస్యం గెలుచుకున్నాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 86.86 మీటర్ల బెస్ట్ ప్రయత్నంతో 4వ స్థానంలో నిలిచారు.  ఇక ఫైనల్‌కి చేరిన మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ ఈటెని 78.72మీ మాత్రమే విసిరి పదో స్థానంలో నిలిచాడు.ఈ నెల చివర్లో ప్రారంభంకానున్న కామన్వెల్త్ గేమ్స్‌లోనూ నీరజ్ చోప్రా పోటీపడనున్నాడు.