Site icon HashtagU Telugu

Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో నీరజ్ చోప్రా

Neeraj Chopra

Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ కు దూసుకెల్లాడు. గ్రూప్-ఏ జావెలిన్ త్రో అర్హత రౌండ్ లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించాడు. నీరజ్ తో పాటు మరో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యాడు. మహిళల ఈవెంట్ లో జరిగిన అర్హత రౌండ్లలో భారత క్రీడాకారిణి అన్నూ రాణి కూడా ఫైనల్ చేరింది.

ఫైనల్‌కు క్వాలిఫై కావడానికి విసరాల్సిన కనీస దూరం 83.5 మీటర్లు కాగా.. నీరజ్‌ మాత్రం ఎంతో మెరుగ్గా విసరడం విశేషం. గ్రూప్‌ ఎలో నీరజ్‌దే బెస్ట్‌ త్రో కాగా.. ఓవరాల్‌గా గ్రెనడాకు చెందిన ఆండర్సన్‌ పీటర్స్‌ మాత్రమే అతని కంటే మెరుగ్గా 89.91 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఇండియాకే చెందిన రోహిత్‌ యాదవ్‌ 80.42 మీటర్లే విసిరినా.. 10వ స్థానంలో నిలవడంతో అతడు కూడా ఫైనల్ కి అర్హత సాధించాడు.
90 మీటర్లు విసరడే టార్గెట్‌గా పెట్టుకున్న నీరజ్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆ రికార్డుపై కన్నేశాడు. ఈ సీజన్‌లో రెండుసార్లు తన పర్సనల్‌ బెస్ట్‌ను మెరుగుపరుచుకోవడంతోపాటు ఆ రెండుసార్లు నేషనల్‌ రికార్డు తిరగరాసిన నీరజ్.. ఈ 90 మీటర్ల మార్క్‌ అందుకునేలానే కనిపిస్తున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. రెండో భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్‌ జంపర్‌ అంజూ బాబి జార్జ్‌ కాంస్య పతకం నెగ్గింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్‌ కేవలం ఒకే ఒక పతకం మాత్రమే సాధించింది.