WCL : భారత్-పాకిస్థాన్ క్రికెట్ పోరు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. కానీ ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్‌లో జరగాల్సిన ఇండియా-పాక్ మ్యాచ్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని జట్టుతో ఆడటానికి ఐదుగురు భారత క్రికెట్ లెజెండ్స్ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితిని సృష్టించింది.
అఫ్రిది వ్యాఖ్యలపై ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇటీవల భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. అంతేకాకుండా పాక్ మిలటరీకి సంఘీభావంగా ఆర్మీ శిబిరాలను సందర్శించడం, అలాగే భారత ఆటగాళ్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయడం భారత మాజీ క్రికెటర్లను ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్ ఆటగాళ్లు అఫ్రిది నేతృత్వంలోని జట్టుతో ఆడటానికి నిరాకరించినట్టు సమాచారం.
భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత
WCL టోర్నీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ పోరు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణ. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మ్యాచ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ తలపడే ఇది మొదటి మ్యాచ్ కావడం వల్ల రాజకీయ, భద్రతా కోణంలో ఇది చర్చనీయాంశంగా మారింది.
నిర్వాహకుల స్పందన
నిజానికి ఈ మ్యాచ్ నేడు బర్మింగ్‌హామ్‌లో జరగాల్సి ఉంది. కానీ ఆటగాళ్ల బహిష్కరణ వార్తలతో చుట్టూ అనుమానాలు మొదలయ్యాయి. అయితే నిర్వాహకులు మ్యాచ్ వాయిదా లేదా రద్దు చేయబోతున్నామన్న వార్తలను ఖండించారు. “భారత్-పాక్ మ్యాచ్ యథావిధిగా జరుగుతుంది. అధికారికంగా ఎలాంటి బహిష్కరణ సమాచారం మాకు రాలేదు” అని నిర్వాహకులు స్పష్టం చేశారు.
గత ఎడిషన్‌లో భారత్ విజయం
గతేడాది జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి కప్‌ను లిఫ్ట్ చేసింది. ఈసారి కూడా భారత్ జట్టు బలంగా కనిపిస్తోంది. కానీ ఆటగాళ్ల నిరాకరణ , దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మ్యాచ్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
మ్యాచ్ భవిష్యత్తు అనిశ్చితం?
భారత్-పాక్ క్రికెట్ పోరు ఎప్పుడూ ద్వైపాక్షిక సంబంధాల ప్రతిబింబంగా ఉంటుంది. అఫ్రిది వ్యాఖ్యలు, పహల్గామ్ దాడి వంటి పరిణామాలు ఈసారి మ్యాచ్‌ను పూర్తిగా వివాదాల కేంద్రంగా మార్చాయి. సీనియర్ క్రికెటర్లు బహిష్కరణపై నిలదీయడంతో టోర్నీలో భారత్ జట్టు పూర్తి బలం చూపుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Ben Stokes: టీమిండియాకు తలనొప్పిగా మారనున్న బెన్ స్టోక్స్?!