Site icon HashtagU Telugu

Afghanistan Asia Cup: బంగ్లాదేశ్ కు షాక్…సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్

Afghan team

Afghan team

ఆసియా కప్ లో ఆఫ్గనిస్తాన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసిన ఆ జట్టు తాజాగా బంగ్లాదేశ్ కి షాక్ ఇచ్చింది. సమిష్టిగా రాణించి రెండో విజయంతో సూపర్ 4లో అడుగు పెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌నుఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్లు నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేశారు. ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌లు స్పిన్ మ్యాజిక్ కి పరుగులు చేసేందుకు బంగ్లా తీవ్రంగా శ్రమించింది.
వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. ముజీబ్‌, రషీద్‌
తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. ముజీబ్‌ 4 ఓవర్లలో కేవలం 16 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా…రషీద్‌ కూడా 4 ఓవర్లలో 22 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.. ఒక దశలో బంగ్లాదేశ్‌ 28 రన్స్‌ కే 4 వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొసద్దక్‌ హుస్సేన్‌ మెరుపులతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. మొసద్దెక్‌ హొసేన్‌ 48 రన్స్ తో అజేయంగా నిలిచాడు.

అయితే 128 రన్స్‌ చేజింగ్‌లో ఆఫ్గనిస్తాన్ కూడా ఆచితూచి ఆడింది. బంగ్లా బౌలర్లు పోరాడడంతో పవర్ ప్లే లో 29 పరుగులే చేసింది. జాజాయ్ 23, గుర్బాజ్ 11 , కెప్టెన్ నబీ 8 రన్స్ కు ఔటయ్యారు. ఒక దశలో 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 రన్స్‌ మాత్రమే చేయడంతో బంగ్లాదేశ్‌ గెలవడం ఖాయంగా కనిపించింది. ఈ దశలో ఆఫ్ఘన్‌ బ్యాటర్లు నజీబుల్లా, ఇబ్రహీం జద్రాన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 36 బాల్స్‌లోనే అజేయంగా 69 రన్స్ జోడించారు. సిక్సర్లతో విరుచుకుపడిన నజీబుల్లా కేవలం 17 బాల్స్‌లోనే 6 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 43 రన్స్‌ చేశాడు. అటు ఇబ్రహీం 41 బాల్స్‌లో 42 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.దీంతో 9 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ చేదించిన ఆఫ్గన్ టీమ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు విజయాలు అందుకున్న ఆఫ్గనిస్తాన్ ఈ ఆసియా కప్ లో సూపర్ 4కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.