Mumbai Indians: ఇంగ్లాండ్ టూర్ కు ముంబై ఇండియన్స్ క్రికెటర్లు

ఐపీఎల్ 15వ సీజన్ లో తనదైన బ్యాటింగ్ తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న బ్యాటర్ తెలుగుతేజం తిలక్ వర్మ.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 08:15 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో తనదైన బ్యాటింగ్ తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న బ్యాటర్ తెలుగుతేజం తిలక్ వర్మ. అరంగేట్రంలోనే అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. ముంబై ఈ సీజన్ లో నిరాశపరిచినా.. బ్యాటింగ్ పరంగా సీనియర్లంతా విఫలమైనా తిలక్ వర్మ మాత్రం నిలకడగా రాణించాడు.

అతనితో పాటు కొందరు యువ క్రికెటర్లు సత్తా చాటారు. దీంతో వీరందరికీ తమ ఆట మరింత మెరుగుపరుచుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అవకాశం కల్పించింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వీరంతా మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్‌ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది.

అక్కడి టాప్‌ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అర్జున్‌ టెండుల్కర్‌ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ సైతం వీరితో చేరునున్నాడని ముంబై ఇండియన్స్ వర్గాలు తెలిపాయి. తాజాగా భారత్‌కు చెందిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్‌ టూర్‌ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. ఈ జాబితాలో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ కూడా ఉన్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్ లో తిలక్ వర్మ 397 పరుగులు చేసి ముంబై తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ పరిస్థితుల్లో రాణిస్తే ఈ యువక్రికెటర్లంతా విజయవంతమైనట్టేనని చెప్పొచ్చు. రానున్న రోజుల్లోనూ ఈ అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంగ్లాండ్ టూర్ కు వెళుతున్న వారిలో తిలక్‌ వర్మ తో పాటు కుమార్‌ కార్తికేయ, హృతిక్‌ షోకేన్‌, మయాంక్‌ మార్కండే, రాహుల్‌ బుద్ధి, రమణ్‌దీప్‌ సింగ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, బాసిల్‌ థంపి, మురుగన్‌ అశ్విన్‌, ఆర్యన్‌ జుయాల్‌, ఆకాశ్‌ మెధ్వాల్‌, అర్షద్‌ ఖాన్‌, అర్జున్‌ టెండుల్కర్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఉన్నారు.