Site icon HashtagU Telugu

Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు

Mumbai Indians Beat Rcb By 4 Wickets

Mumbai Indians Beat Rcb By 4 Wickets

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టర్ ఫ్లాప్ అయింది. స్టార్ క్రికెటర్లు ఉన్నా సరైన విజయాలు సాధించలేకపోయింది. చివరి లీగ్ మ్యాచ్ లోనూ పరాజయం పాలై ఓటమితో సీజన్ ను ముగించింది. ముంబై (Mumbai Indians) చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఈ మ్యాచ్ లోనూ నిరాశపరిచింది. అంచనాలు పెట్టుకున్న ఆ జట్టు బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ స్మృతి మంధాన 24 (3 ఫోర్లు, 1 సిక్సర్) , ఎల్లిస్ పెర్రీ 29 , రిఛా ఘోష్ 29 ( 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మోస్తారుగా పర్వాలేదనిపించారు. మిగిలిన వారంతా విఫలమవడంతో బెంగళూరు 125 పరుగులకే పరిమితమైంది. సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడంతో పాటు ధాటిగా ఆడలేకపోవడం కూడా ఆ జట్టుకు మైనస్ గా మారింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 , వాంగ్ 2 , బ్రంట్ 2 వికెట్లు పడగొట్టారు.

126 పరుగుల లక్ష్యఛేదనలో ముంబైకి (Mumbai Indians) ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు భాటియా , మాథ్యూస్ 6 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు. భాటియా 26 బంతుల్లో 6 ఫోర్లతో 30 , మాథ్యూస్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 24 రన్స్ చేశారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవడం…తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో అమేలియా కెర్ , పూజా వస్త్రాకర్ ముంబైని ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ బెంగళూరు ఆశలపై నీళ్ళు చల్లారు. అమేలియా 24 బంతుల్లో 31 నాటౌట్ గా నిలవడంతో ముంబై 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో లీగ్ స్టేజ్ ను ముంబై 6 విజయాలతో ముగించింది. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన బెంగళూరు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 8 మ్యాచ్ లలో ఆ జట్టు కేవలం రెండు విజయాలే సాధించి.. ఆరింటిలో పరాజయం పాలైంది.

Also Read:  Biryani Vending Machine: దేశంలోనే ఫస్ట్ బిర్యానీ వెండింగ్ మెషీన్‌.. చెన్నై స్టార్టప్ సెన్సేషన్..