MI vs RR: వాంఖేడేలో మురిసిన ముంబై.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై గెలుపు

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. సొంతగడ్డపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన ముంబై హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 12:12 AM IST

MI vs RR: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. సొంతగడ్డపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన ముంబై హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. హైస్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశశ్వి జైశ్వాల్ , జాస్ బట్లర్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. బట్లర్ కాస్త ఇబ్బందిపడినా… జైశ్వాల్ మాత్రం చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లు, వరుస ఫోర్లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జైశ్వాల్ జోరుతో రాజస్థాన్ స్కోర్ టాప్ గేర్‌లో సాగింది. శాంసన్ 14, పటిక్కల్ 2, హోల్డర్ 11 , హిట్‌మెయిర్ 8 , ధ్రువ్ జురెల్ 2 పరుగులకే ఔటయ్యారు. వీరంతా వెనుదిరిగుతున్నా.. జైశ్వాల్ మాత్రం దూకుడు కొనసాగిస్తూ రెచ్చిపోయాడు. 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. జైశ్వాల్ మెరుపులతో రాజస్థాన్ 212 పరుగులు చేసింది. జైశ్వాల్ 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 112 పరుగులు బౌండరీ ద్వారానే వచ్చాయి. ముంబై బౌలర్లలో చావ్లా 2, ఆర్చర్, మెరిడెత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ , కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. గ్రీన్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 28 రన్స్‌కు ఔటయ్యాడుయ. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీతో ముంబై ఇన్నింగ్స్ దూకుడుగానే కొనసాగింది.

తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన సూర్యకుమార్ 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అయితే సూర్య ఔటైన తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో ముంబై ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో టిమ్ డేవిడ్, తిలక్ వర్మ భారీ షాట్లతో ముంబైని విజయం దిశగా నడిపించారు. తిలక్ వర్మ సపోర్ట్‌తో రెచ్చిపోయిన టిమ్ డేవిడ్ కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 రన్స్ చేశాడు.

చివరి ఓవర్‌లో విజయం కోసం 17 పరుగులు చేయాల్సి ఉండగా… హోల్డర్‌ను ఉతికారేశాడు టిమ్ డేవిడ్. తొలి మూడు బంతుల్లోనే భారీ షాట్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది నాలుగో విజయం. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు ఇది నాలుగో ఓటమి.