Site icon HashtagU Telugu

Mumbai Indians: కొత్త కెప్టెన్… పాత జట్టు.. ముంబై ఆరేస్తుందా ?

Mumbai Indians

Mumbai Indians

Mumbai Indians: ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదంటే గుర్తొచ్చే పేరు ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)…ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు విజేతగా నిలిచింది. ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకుని టైటిల్ గెలవడం ఆ జట్టుకు అలవాటే.. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ముంబైకి మేజర్ అడ్వాంటేజ్..ఈ సీజన్ లో మాత్రం దానికి భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి హార్ధిక్ పాండ్యకు పగ్గాలు అప్పగించింది. 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌.. ముంబయిని వదిలి వెళ్లాడు. ఆ ఏడాది గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. నిరుడు మరోసారి ఫైనల్‌ చేర్చాడు. దీంతో ట్రేడింగ్ లో భారీ మొత్తం వెచ్చించి ముంబై అతన్ని జట్టులోకి తీసుకుంది. రోహిత్ ఈ సీజన్ లో ప్లేయర్ గానే జట్టులో ఉండనుండగా.. ముంబయి నవ శకంలో ఇది తొలి అడుగుగా చెప్పొచ్చు. మరి హార్దిక్‌ అంచనాలను అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

చివరగా 2020లో ట్రోఫీ గెలిచిన తర్వాత రెండు సీజన్ల పాటు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. నిరుడు పుంజుకుని ప్లేఆఫ్స్‌ వరకూ వెళ్లింది. ముంబై బలాబలాలను చూస్తే లీగ్‌లో మరే జట్టుకు లేని పటిష్టమయిన బ్యాటింగ్‌ లైనప్‌ ఆ జట్టు సొంతం. పరిస్థితులకు తగ్గట్లు ఆడే బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాగే ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే పవర్‌ హిట్టర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. రోహిత్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌తో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్‌ వర్మతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ చూస్తే ప్రత్యర్థులకు కంగారే. వీళ్లకు తోడు మళ్లీ హార్దిక్‌ జట్టులోకి రావడంతో పాటు టిమ్‌ డేవిడ్‌, బ్రేవిస్‌, మహమ్మద్‌ నబి వంటి ఆల్ రౌండర్స్ ఉండనే ఉన్నారు.

Also Read: Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?

అటు బౌలింగ్ లోనూ అత్యుత్తమ పేస్‌ ఎటాక్ ఆ జట్టుకున్న మరో బలం. గాయంతో గత సీజన్‌కు దూరమైన బుమ్రా ఇప్పుడు జట్టుతో చేరాడు. కొయెట్జీ, మదుశంకతో పాటు నువాన్‌ను ముంబయి వేలంలో తీసుకుంది. వీళ్లకు తోడు బెరెండార్ఫ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌ ఉండనే ఉన్నారు. నబి, హార్దిక్‌, షెఫర్డ్‌, నేహాల్‌ ఉండటంతో ఎటువంటి ఇబ్బందీ లేదు. అయితే అంచనాలు పెట్టుకున్న స్టార్ బ్యాటర్లు ఎంతవరకూ నిలకడగా రాణిస్తారనేది చూడాలి. ఇక స్పిన్‌ విభాగం మరోసారి బలహీనంగా కనిపిస్తోంది. మళ్లీ వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లానే కీలకం కానున్నాడు. రోహిత్‌ను కాదని హార్దిక్‌ను కెప్టెన్‌ చేయడంతో ముంబయి ఇండియన్స్‌ అభిమానులే కాకుండా ఆ జట్టులోని కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జట్టును సమర్థవంతంగా నడిపించడం హార్థిక్ కు పెద్ద సవాల్ గానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాండ్య కెప్టెన్సీ సత్తాకు ఈ సీజన్ పరీక్షగా భావిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join