ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కొత్త కోచ్ గా సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్ లో టీమ్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసి అందులో జహీర్‌ఖాన్, జయవర్దనెలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ కోచ్ గా ఉన్న జయవర్థనే ఆ బాధ్యతల్లో బిజీ కానుండడంతో ఆ పదవి ఖాళీ అయింది. ముందు నుంచీ ఊహించినట్టుగానే బౌచర్ నే ముంబై ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. మొదట అతడు సౌతాఫ్రికా లీగ్‌లోని ఎంఐ కేప్‌టౌన్ కోచ్ గా ఉంటాడని భావించినా…ఆ బాధ్యతలు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్ చేపట్టడంతో బౌచర్ ఐపీఎల్ లో కోచ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఉన్న మహేల జయవర్దనెను తాజాగా గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్‌గా నియమించారు. అతనితోపాటు జహీర్‌ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా నియమించారు. ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ గ్రూప్ మూడు టీమ్స్ బాధ్యతలు చూసుకుంటారు. కాగా సౌతాఫ్రికా హెడ్ కోచ్‌గా ఉన్న మార్క్ బౌచర్.. ఆ టీమ్ ఇంగ్లండ్ చేతుల్లో 1-2తో టెస్ట్ సిరీస్ ఓడిపోగానే పదవికి రాజీనామా చేశాడు. టీ20 వరల్డ్‌కప్ వరకూ కోచ్‌గా కొనసాగనున్న బౌచర్.. తర్వాత నేరుగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అటు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బౌచర్ చెప్పాడు. ఈ సవాలుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, గొప్ప నాయకత్వం, గొప్ప ప్లేయర్స్‌తో ముంబై బలంగా ఉందన్నాడు.