Mumbai Indians Win: చెన్నై కథ ముగిసింది

ఐపీఎల్ 15వ సీజన్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 11:13 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ఆ టీమ్‌ బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో చెన్నైకి ఘోర పరాజయం పాలైంది. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న ముంబై తనతో పాటు చెన్నైను కూడా ఇంటికి తీసుకెళ్ళింది. మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై 16 ఓవర్లలో కేవలం 97 రన్స్‌కే కుప్పకూలింది. డేనియల్‌ సామ్స్‌, మెరిడిత్‌, కార్తికేయ చెలరేగిన వేళ.. చెన్నై బ్యాటర్లు చేతులెత్తేశారు. సామ్స్‌ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 16 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ధోనీ ఒక్కడే 33 బాల్స్‌లో 36 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. ధోనీ ఆడకుంటే ఆ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదు.అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.
ఈజీ టార్గెటే అయినా.. ముంబై కూడా తడబడుతూ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ముఖేశ్ చౌదరీ, సిమర్‌జిత్‌ సింగ్‌ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. తర్వాత రోహిత్ శర్మ, డేనియల్ సామ్స్‌ , స్టబ్స్‌ నిరాశ పరిచారు. దీంతో ముంబై 33 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ, హృతిక్‌ షోకీన్‌ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించి ముంబైని గట్టెక్కించారు. తిలక్‌ వర్మ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్‌ చౌదరి మూడు, సమర్‌జీత్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ సాధించారు. ఈ సీజన్ లో ముంబైకి ఇది మూడో విజయం. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.