Site icon HashtagU Telugu

CSK vs DC: చెపాక్ లో అదరగొట్టిన చెన్నై… ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం

Csk

Csk

CSK vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు మరింత చేరువైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్ లో తడబడి నిలబడిన ధోనీసేన బౌలింగ్ లో సమిష్టిగా రాణించి ఢిల్లీని ఓడించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే తొలి వికెట్ కు 32 పరుగులే జోడించారు. ఫామ్ లో ఉన్న కాన్వే 10 , రుతురాజ్ 24 పరుగులకు ఔటవగా.. ధాటిగా ఆడిన రహానే 21, మొయిన్ అలీ 7 పరుగులకు పెవిలియన్ చేరుకున్నారు. మిగిలిన బ్యాటర్లు క్రీజులో వస్తూనే వేగంగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్లు కొట్టారు. అంబటి రాయుడు, శివమ్ దూబే కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 36 పరుగులు జోడించారు. దూబే 25, రాయుడు 23 పరుగులకు ఔటవగా.. తర్వాత రవీంద్ర జడేజా, ధోనీ చివర్లో మెరుపులు మెరిపించారు. జడేజా 16 బంతుల్లో 21 రన్స్ చేయగా.. ఎప్పటిలానే ధోనీ భారీ షాట్లతో చివర్లో అభిమానులను ఉర్రూతలూగించాడు. కేవలం 9 బంతుల్లోనే 2 సిక్సర్లు, 1 ఫోర్ తో 20 పరుగులు చేశాడు. ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ చెపాక్ స్టేడియం హోరెత్తిపోయింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిఛెల్ మార్ష్ 3 , అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. కుల్ దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

స్లో పిచ్ పై 168 పరుగుల టార్గెట్ ను ఛేదించడం అంత సులభం కాదని ఢిల్లీకి తొలి ఓవర్లలోనే అర్థమైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఔటయ్యాడు. కాసేపటికే ఫిల్ సాల్ట్ , మిఛెల్ మార్ష్ కూడా వెంటవెంటనే ఔటవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో రొసో, మనీశ్ పాండే ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడుతూ నాలుగో వికెట్ కు 59 పరుగులు జోడించారు. మనీశ్ పాండే 27 , రొసో 35 పరుగులకు ఔటైన తర్వాత ఢిల్లీ స్కోరు వేగం తగ్గిపోయింది. మిగిలిన బ్యాటర్లకు చెన్నై బౌలర్లు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో అక్షర్ పటేల్ కూడా ఏం చేయలేకపోయాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 140 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది ఏడో ఓటమి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్టే. మరోవైపు ఏడో విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరువైంది.