డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు మరో టెన్షన్ మొదలయింది. ఇప్పటికే కొందరు ఆటగాళ్ళ ఫిట్ నెస్ ఆందోళన కలిగిస్తుంటే తాజాగా ఆల్ రౌండర్ మోయిన్ అలీ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. వీసా సమస్య కారణంగా అతను భారత్ చేరుకోవడం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ గత 20 రోజులుగా భారత్‌కి రావడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. మార్చి 26న జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై గత సీజన్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోయిన్‌కు వీసా రాకపోవడంతో చెన్నై ఆందోళన పడుతోంది.
మోయీన్ అలీ వీసా సమస్యపై చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథ్ స్పందించారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అతను జట్టుతో చేరతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతను వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడనీ, అతనికి ఇంకా వీసా రాకపోవడానికి కారణం ఏంటో తెలియదన్నారు. త్వరలో జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పిన ఆయన ఈ విషయంలో బీసీసీఐ సహకారం తీసుకుంటామని తెలిపారు. సోమవారం నాటికి ఈ సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించారు.
మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ 8 కోట్లకి రీటైన్ చేసుకుంది. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై నాలుగో టైటిల్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. మొయిన్ అలీ ఇప్పటి వరకూ
34 మ్యాచ్ లలో 666 పరుగులు , 16 వికెట్లు తీశాడు.