Site icon HashtagU Telugu

MS Dhoni: టీమిండియా మెంట‌ర్‌గా ఎంఎస్ ధోనీ?

Top ODI Captains

Top ODI Captains

MS Dhoni: భారత క్రికెట్ జట్టు కొన్ని రోజుల్లో ఆసియా కప్ కోసం బయలుదేరనుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాలను ప్రారంభిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తన టైటిల్‌ను కాపాడుకోవాల్సి ఉంది. దీని కోసం బీసీసీఐ ఎంఎస్ ధోనీని (MS Dhoni) మెంటార్‌గా నియమించాలని యోచిస్తోంది.

ధోనీకి బీసీసీఐ నుండి ఆఫర్

2026 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ధోనీని టీమ్ మెంటర్‌గా నియమించడానికి బీసీసీఐ ప్రతిపాదించింది. “క్రికబ్లాగర్” అనే వెబ్‌సైట్ బీసీసీఐ వర్గాల నుండి ఈ విషయాన్ని పేర్కొంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. “ధోనీకి మరోసారి భారత క్రికెట్‌కు మార్గనిర్దేశం చేయాలని ప్రతిపాదించారు” అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ధోనీ నాయకత్వంలో భారత్ 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అలాగే 2014 టీ20 ప్రపంచకప్‌లో కూడా ధోనీ సారథ్యంలోనే భారత్ ఫైనల్‌కు చేరుకుంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించారు.

Also Read: Cricket Fitness: యో-యో టెస్ట్‌తో పాటు బ్రూనో టెస్ట్‌లో పాల్గొన్న టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు!

ఆఫర్‌ను ధోనీ అంగీకరిస్తారా?

ఒకవేళ బీసీసీఐ ధోనీకి ఈ ఆఫర్ ఇస్తే ఆయన అంగీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. ధోనీ- గంభీర్ మధ్య సంబంధాలు అంత మంచిగా లేవని తెలుస్తోంది. గంభీర్ పలు సందర్భాల్లో ధోనీకి వ్యతిరేకంగా మాట్లాడటం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ ధోనీకి ఈ ఆఫర్ లభిస్తే దానిని ఆయన తిరస్కరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధోనీ, గంభీర్ ఇద్దరూ కలసి 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను విజేతలుగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ వారిద్దరూ ఒకే యూనిట్‌గా పనిచేస్తే అది భారత క్రికెట్‌కు గొప్ప బలాన్ని ఇస్తుంది. అయితే ధోనీ ఈ ఆఫర్‌ను అంగీకరించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని గుర్తించడంలో ధోనీకి గొప్ప అనుభవం ఉంది.

Exit mobile version