MS Dhoni: ఎంఎస్ ధోని చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ ఎంతో తెలుసా..?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 'మహి' తనకంటూ ఓ బ్రాండ్.

  • Written By:
  • Publish Date - November 9, 2022 / 04:58 PM IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ‘మహి’ తనకంటూ ఓ బ్రాండ్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయిన తర్వాత కూడా ధోనీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ధోనీ జమ చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా ఇది ధృవీకరించబడింది. గత ఆర్థిక సంవత్సరంలో ధోనీ రూ. 13 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 17 కోట్లు. గతసారి కంటే రూ. 4 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ జమ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ధోనీ ఆదాయం 30 శాతం పెరుగుతుందని అంచనా.

క్రికెట్ ప్రపంచంలోకి ప్రవేశించినప్పటి నుండి ధోనీ జార్ఖంఢ్ రాష్ట్రంలో అతిపెద్ద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా మిగిలిపోయాడు. టీ20, వన్డేల్లో భారత జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా జట్టుకు నాలుగుసార్లు IPL టైటిల్‌ను,రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ధోనీకి చాలా ఆదాయ వనరులు ఉన్నాయి. సెవెన్ పేరుతో తన స్వంత స్పోర్ట్స్ వేర్ బ్రాండ్‌ను కలిగి ఉన్నాడు. ధోనీ దేశ, విదేశాల్లో వివిధ ఉత్పత్తులు, సంస్థలను కూడా ప్రమోట్ చేస్తున్నాడు. అదే సమయంలో ధోనీ క్రికెట్ అకాడమీ కూడా నడిపిస్తున్నాడు.

ధోనీ ఇటీవల బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించాడు. ఇది కాకుండా ధోని గతంలో సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ధోనీ బ్యానర్‌లో తొలి సినిమా తమిళంలో రూపొందనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి అక్టోబర్ 2022 వరకు మహేంద్ర సింగ్ ధోనీ మొత్తం 85 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాడు. ధోనీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 30 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాడు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 ప్రభావం తక్కువగా ఉంది. 2021-22 సంవత్సరంలో మాజీ కెప్టెన్ ధోనీ ఆదాయం పెరిగింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.38 కోట్లు చెల్లించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021 నుండి అక్టోబర్ 2021 వరకు మొత్తం రూ.13 కోట్లు చెల్లించాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు అడ్వాన్స్ ట్యాక్స్ కింద రూ.17 కోట్లు చెల్లించాడు.