మెగా టోర్నీల్లో భారత్‌కు రనౌట్లు (Run Outs) శాపంగా మారుతున్నాయా.. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ధోనీ.. 2023 మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ రనౌట్లు టీమిండియాకు ఫైనల్ బెర్తును దూరం చేశాయి. తాజాగా హర్మన్‌ప్రీత్ రనౌట్‌తో అప్పటి ధోనీ ఔట్‌ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో భారత్ ఒకటి. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ సెమీఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అభిమానులను చివరి వరకూ అలరించినా భారత్‌కు విజయాన్ని దూరం చేసింది మాత్రం ధోనీ రనౌటే. టూ పేస్ వికెట్‌పై 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ టాపార్డర్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. రాహుల్, రోహిత్ , కోహ్లీ 1 పరుగుకే ఔటవగా.. దినేశ్ కార్తీక్ కూడా నిరాశపరిచాడు. ఈ దశలో పంత్, పాండ్యా ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించారు. తర్వాత ధోనీ, జడేజా కీలక పార్టనర్‌షిప్‌తో టీమిండియా గెలిచేలా కనిపించింది.
Also Read: T20 Semi Finals: కొంపముంచిన రనౌట్లు… సెమీస్ లో భారత్ ఓటమి
అయితే విజయం కోసం మరో 24 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోనీ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హాఫ్ సెంచరీ చేసిన ధోనీని మార్టిన్ గప్తిల్ రనౌట్ చేశాడు. గప్తిల్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. వికెట్ల మధ్య ధోనీ ఎంత వేగంగా పరిగెడతాడో అందరికీ తెలుసు. అలాంటిది ధోనీ రనౌటవడం కొంపముంచింది. తర్వాత జడేజా కూడా వెనుదిరగడంతో భారత్ కథ సెమీస్‌లోనే ముగిసింది. ఇప్పుడు మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.
టాపార్డర్ విఫలమవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను నిలబెట్టింది. భారీ షాట్లతో రన్‌రేట్ పడిపోకుండా అద్భుతంగా ఆడింది. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ అనూహ్యంగా రనౌటైంది. బౌండరీ దగ్గరకు బండి వెళ్ళడంతో సులభంగా రెండు రన్స్ తీసేందుకు ప్రయత్నించింది. క్రీజులోకి వచ్చే ముందు బ్యాట్ దిగబడడంతో ఆమె క్రీజులోకి చేరుకోలేకపోయింది. ఫలితంగా రనౌట్‌గా పెవిలియన్ చేరుకుంది. హర్మన్ రనౌట్ కాకుండా ఉంటే భారత్ ఖచ్చితంగా గెలిచి ఉండేది. మొత్తం మీద ప్రపంచకప్‌లో రనౌట్లు రూపంలో భారత్‌ను దురదృష్టం వెంటాడుతుందని చెప్పొచ్చు.